BJP Strategy: బీజేపీ ‘శివాజీ’ ఇజం!
మతతత్వ పార్టీగా పేరున్న బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుందా..? రాజకీయ లబ్ధి కోసం ‘శివాజీ’ ఇజాన్ని అనుసరిస్తుందా..?
- By Balu J Published Date - 12:07 PM, Tue - 5 April 22

మతతత్వ పార్టీగా పేరున్న బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుందా..? రాజకీయ లబ్ధి కోసం ‘శివాజీ’ ఇజాన్ని అనుసరిస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. గత వారంరోజులుగా తెలంగాణలో ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌లోని బోధన్ పట్టణం నడిబొడ్డున శివాజీ విగ్రహం ఏర్పాటైంది. విగ్రహ ఏర్పాటుతో హిందువులు, ముస్లింల మధ్య మత ఘర్షణలు చెలరేగడంతో బోధన్ ఒక వారంపాటు IPC సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలను ఎదుర్కొంది. అయితే బోధన్ దాటి ఉత్తర తెలంగాణలోని ఇతర గ్రామాలు, పట్టణాలకు వెళితే, కొత్తగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాలు చాలా వరకు కనిపిస్తాయి. తెలంగాణలోని ప్రతి గ్రామం, పట్టణంలో ఎప్పట్నుంచో సర్వసాధారణంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాల పక్కన శివాజీ విగ్రహాలను వ్యూహాత్మకంగా ఏర్పాటుచేస్తుండటం రాజకీయాంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
బిజెపి, దాని అనుబంధ సంస్థలు శివాజీ మంత్రాన్ని జపిస్తున్నాయి. మరాఠీకి ప్రతీక అయిన శివాజీ, రాష్ట్రంలోని హిందూత్వ గ్రూపులు సరిహద్దు జిల్లాల్లో రెండు సంవత్సరాలుగా (ఉత్తర తెలంగాణలో) శివాజీ విగ్రహాలు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. బోధన్‌లో మార్చి 24న శివాజీ విగ్రహాన్ని BR అంబేద్కర్ కూడలి సమీపంలో శివసేన సభ్యుడు గోపి కిషన్ స్థాపించారు. ఈ విగ్రహాన్ని రాత్రిపూట ప్రతిష్టించారు. అంతకుముందే ఏర్పాటైన వివేకానంద విగ్రహం, తెలంగాణ అమరవీరుల స్థూపం సమీపంలో శివాజీ విగ్రహం స్థాపించారు. అయితే పోలీసుల సమాచారం ప్రకారం ప్రతిష్ఠాపనకు అవసరమైన అనుమతులు లేవు. అంతేకాదు.. ఆ ప్రాంతంలోని ప్రజలకు సమాచారం లేదు. ఈ కారణంగానే విగ్రహ ప్రతిష్ఠాపన రెండు గ్రూపుల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. ఒకవైపు BJP, శివసేన, మరోవైపు, ఇతర పార్టీల సభ్యులతో పాటు AIMIM గ్రూపుల మధ్య రాళ్లదాడి జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనలో వారి పాత్రకు సంబంధించి 25 మందికి పైగా అరెస్టు చేశామని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని ACP-ర్యాంక్ పోలీసు అధికారి తెలిపారు.
శివాజీ విగ్రహాన్ని నెలకొల్పిన మార్చి 24 తర్వాత బోధన్‌లో పరిస్థితి మతపరమైనదిగా మారుతున్నప్పటికీ, బిజెపి, ఇతర మతవాద సంస్థలు బోధన్‌లోని శివాజీ విగ్రహానికి వ్యతిరేకతను ముస్లింల నుంచి హిందువులకు ముప్పుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియా ప్రచారాలను ప్రారంభించాయి. అయితే ఇదే విషయమై స్థానిక బిజెపి నాయకుడు, బోధన్ మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ రామరాజు “మునిసిపల్ కౌన్సిల్ శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలంగా తీర్మానం చేసినప్పటికీ మైనారిటీ వర్గం శివాజీ విగ్రహ ప్రతిష్టాపనను ఆపడానికి ప్రయత్నించింది.” తెలంగాణలో శివాజీ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అని ప్రశ్నించినప్పుడు “మేం మహాపురుషుల స్ఫూర్తిని గుర్తుచేసుకోవడానికి విగ్రహాలను ఏర్పాటుచేశామని” అని ఆయన బదులిచ్చారు.
తాజాగా ధర్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అనుమతి లేకుండా మరో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఇదే తరహా వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. బీజేపీ, హిందూ సంస్థలు ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని జరుపుకోవడం తప్ప తమకు వేరే ఉద్దేశ్యం లేదని పేర్కొంటున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన చత్రపతి శివాజీ విగ్రహాలు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రతిష్టించబడ్డాయి. గ్రామాలు, పట్టణాల్లో రద్దీగా ఉండే కూడళ్లలో విగ్రహాలు కనిపిస్తున్నాయి. స్థానిక యువకులే ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శివాజీ విగ్రహాల వెనుక రాజకీయ కారాణాలున్నాయా? మతపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.