7 Dead in Telangana : రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం.. ఏడుగురి మృతి
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. భారీ ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి ఏడుగురు మృతి చెందారు.
- By News Desk Published Date - 07:18 PM, Sun - 26 May 24

7 Dead in Telangana : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. భారీ ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి ఏడుగురు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ లో కోళ్ల ఫారం గోడకూలి నలుగురు మృతి చెందారు. అదే జిల్లాలోని తెలకపల్లి మండలంలో పిడుగు పడి పన్నెండేళ్ల బాలుడు లక్ష్మణ్ మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైకర్ పై పడటంతో.. నాగిరెడ్డి రామ్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు.
కోళ్లఫారంలో షెడ్డుకూలి మరణించిన వారిని.. ఆ షెడ్డు యజమాని మల్లేష్, పదేళ్ల చిన్నారి, ఇద్దరు కూలీలుగా గుర్తించారు. శామీర్ పేట చెట్టు కూలిన ఘటనలో ధనుంజయ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలవ్వగా.. ఈసీఐఎల్ లో ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించాడు. మృతుడు బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.
హయత్‌నగర్, పెద్ద అంబర్ పేట్, మల్కాజిగిరి, ఉప్పల్, కుషాయిగూడ, మేడ్చల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హైటెక్ సిటీ, మాధాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాష్ట్రంలో ఈదురుగాలులు, భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండటంతో.. ప్రజలు చెట్ల కింద ఉండొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. విద్యుత్ స్తంభాలకు సమీపంలో ఉండొద్దని సూచించింది.