KTR : కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారా..? తెలంగాణ భవన్ చుట్టూ భారీగా పోలీసులు
సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది. అరెస్టు ప్రణాళిక సిద్ధం చేస్తూ, న్యాయపరమైన అభ్యంతరాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది
- Author : Sudheer
Date : 19-12-2024 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారం (Formula E Car Race Case) తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది. ఈ కేసులో కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తుంది. కేటీఆర్‌ను A1, అర్వింద్ కుమార్‌ను A2, బీఎల్ఎన్ రెడ్డిని A3గా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1A), 13(2), 409, 120 సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం కేంద్రంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది. అరెస్టు ప్రణాళిక సిద్ధం చేస్తూ, న్యాయపరమైన అభ్యంతరాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హైప్రొఫైల్ కేసు కావడంతో దర్యాప్తు వివరాలు రహస్యంగా ఉంచినట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం ఉద్రిక్తతలను పెంచింది. కేటీఆర్ అరెస్టు జరిగే అవకాశం ఉందనే వార్తలతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పోలీసుల భారీ బందోబస్తు కారణంగా ప్రజలు, మీడియా దృష్టి తెలంగాణ భవన్ వైపు మళ్లింది. ఈ కేసు నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Read Also : 10th class exam : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల