Weather Report: నల్గొండలో రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత ..!
- Author : HashtagU Desk
Date : 18-03-2022 - 3:06 IST
Published By : Hashtagu Telugu Desk
తెంగాణలో ఎండలు మండుతున్నాయి. సహజంగా ఏప్రిల్ నుంచి ఎండలు దంచికొడతాయి. అయితే ఈసారి మార్చిలోనే భానుడు ఓ రేంజ్‌లో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 8 గటల నుంచే ఎండలు మండిపోతుండడంతో, జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక వచ్చే నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్నాయని, అలాగే వడగాల్పుల ప్రభావం కూడా అంధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే.. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. గురువారం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని ఐఎండీ తెలిపింది. దీంతో నల్గొండ జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. ఈ క్రమంలో మరోమూడు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది. గతేడాది మార్చిలో 37.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే ఈ ఏడాది మాత్రం అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోవుతుండడంతో, ప్రజలు భయపడిపోతున్నారు.
ఇకపోతే పశ్చిమ రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. జమ్మూకశ్మీర్, లడఖ్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రలోని మరఠ్వాడ, వెస్ట్ బెంగాల్, సిక్కిం, నాగలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఈస్ట్ మధ్యప్రదేశ్, తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.