KCR : రైతు బాధ విని చలించిపోయిన కేసీఆర్.. రూ.5 లక్షల ఆర్థికసాయం
KCR : ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్నారు.
- By Pasha Published Date - 03:33 PM, Sun - 31 March 24

KCR : ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆదివారం ఉదయం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువురు రైతులను కేసీఆర్ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయానంటూ ధరావత్ తండాకు చెందిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్‌కు తన గోడును వెళ్లబోసుకుంది. పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్‌కు(KCR) వివరించింది. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని.. పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఇబ్బందిపడుతున్నారని ఆమె చెప్పుకున్నారు. దీనిపై తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుడి వివాహ ఖర్చుకు ఐదు లక్షల రూపాయల సాయాన్ని అందించారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రైతులు ధైర్యంగా ఉండాలి. పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందాం. 24 గంటల కరెంటును సాధించుకుందాం. రైతు రుణమాఫీని, రైతు బంధును పోరాడి సాధించుకుందాం’’ అని రైతులకు భరోసా ఇచ్చారు.
Also Read :Fake Profiles Mafia : కంబోడియా ‘సైబర్’ గ్యాంగ్ ఉచ్చులో వందలాది మంది తెలుగువారు ?!
అంతకుముందు ఆదివారం ఉదయం ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్.. జనగామ జిల్లా దేవరప్పుల మండలం దారవత్ తండాకు చేరుకున్నారు. తండాలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లిన కేసీఆర్.. అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించారు. పంట పొలాలను, ఎండిన పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి సాయంత్రం తిరిగి ఎర్రవెళ్లి ఫాంహౌస్ కు బయలుదేరుతారని పేర్కొన్నాయి.