BRS IT Cell: హెచ్‌సీయూ వ్యవహారం.. బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై కేసు
హెచ్‌సీయూ అధికారులను సంప్రదించకుండా వీడియోలు చేసి, వాటిని ఎడిట్ చేసి ప్రజలను రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో(BRS IT Cell) వైరల్ చేశారని ఆరోపించారు.
- By Pasha Published Date - 07:22 PM, Thu - 3 April 25

BRS IT Cell : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారంలో విద్యార్థుల నిరసనలకు సంబంధించి నకిలీ వీడియోలను వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ దిలీప్, క్రిశాంక్‌లపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసు స్టేషనులో కేసును నమోదు చేశారు. వారిపై భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 353, 1(C), 353(2), 192, 196(1),61(1)(a) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే నకిలీ వీడియోలను తయారు చేసి, వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగాలను దిలీప్, క్రిశాంక్‌లపై దాఖలు చేశారు. హెచ్‌సీయూ అధికారులను సంప్రదించకుండా వీడియోలు చేసి, వాటిని ఎడిట్ చేసి ప్రజలను రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో(BRS IT Cell) వైరల్ చేశారని ఆరోపించారు.
Also Read :First Pod Hotel: దేశంలోనే తొలి పాడ్ హోటల్.. ఏమిటిది ? ఎందుకు ?
సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఇవాళ (గురువారం) సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఆ భూముల విషయంలో చర్యలను నిలిపి వేయాలంటూ రాష్ట్ర సర్కారుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపించారు. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ధర్మాసనం, చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని తెలిపింది. ఈ వ్యవహారంపై ప్రచురితమైన కథనాలను జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఎదుట అమికస్ క్యూరీ ప్రస్తావించింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చారు.
Also Read :Jhukunga Nahin : ‘‘తగ్గేదేలే’’ అంటూ రాజ్యసభలో ఖర్గే హూంకారం.. ఎందుకంటే..
అత్యవసరంగా కార్యకలాపాలు ఎందుకు ?
అత్యవసరంగా కంచ గచ్చిబౌలి భూముల్లో కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ ఇచ్చింది. ‘‘30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉంది. అవి అటవీ భూములు అని ఆధారాలు లేవు’’ అని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.