Operation Karre Guttalu: హెలికాప్టర్ల చక్కర్లు.. కాల్పుల శబ్దాలు.. బాంబు పేలుళ్లు.. ఆపరేషన్ కర్రెగుట్ట
ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కర్రెగుట్టల్లో(Operation Karre Guttalu) కాల్పుల మోత వినిపిస్తోంది.
- By Pasha Published Date - 10:34 AM, Thu - 24 April 25

Operation Karre Guttalu: ‘బచావో కర్రెగుట్టలు’ పేరుతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో పోలీస్, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు పాల్గొంటున్నాయి. మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా దళం కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటాపురం(నూగూరు) కస్తూర్బా పాఠశాల ఆవరణలో భద్రతా బలగాలు రెండు హెలికాప్టర్లను మోహరించాయి. కర్రెగుట్ట అడవుల్లో రెండు హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, అడవుల నుంచి కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వెంకటాపురం సమీపంలోని హెలిప్యాడ్ నుంచే బలగాలకు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసరాలను చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read :Indus Water Treaty: సింధు జల ఒప్పందం ఏమిటి? నీటి కోసం పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవా!
2 నిమిషాలకు ఒకసారి కాల్పుల మోత
ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కర్రెగుట్టల్లో(Operation Karre Guttalu) కాల్పుల మోత వినిపిస్తోంది. మావోయిస్టులు అమర్చిన వందలాది మందుపాతరలను(ల్యాండ్ మైన్స్) నిర్వీర్యం చేసుకుంటూ భద్రతా బలగాలు అడవిలో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. తొలుత డ్రోన్లను కర్రెగుట్టల్లోని అడవుల్లోకి పంపి.. తాము వెళ్లబోయే ఏరియాలో మావోయిస్టుల ఉనికి ఉందా లేదా అనే నిర్ధారణకు భద్రతా బలగాలు వస్తున్నాయి. అక్కడ ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చాకే ముందుకు కదులుతున్నారు. ఒకే మార్గం ద్వారా గుట్టపైకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే పోలీసులు, భద్రతా బలగాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల వద్ద రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్‌లు, ఏకే 47 రైఫిల్స్ ఉన్నాయట.
Also Read :Mosquitoes Bite: షాకింగ్ రిపోర్ట్.. ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి?
మావోయిస్టులు వెళ్లిపోయారా ?
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో280 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ గుట్టలు చాలా హైట్‌లో ఉంటాయి. ఒకవేళ మావోయిస్టులు ఆ గుట్టలపైనే ఉన్నా.. భద్రతా బలగాలు ఆ గుట్టలను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ఇంకో వారం రోజుల సమయం పడుతుంది. ఆలోగా అక్కడి నుంచి తప్పించుకునే ప్లాన్‌ను మావోయిస్టులు అమలు చేసే అవకాశం ఉంది. కర్రెగుట్టలపైకి వచ్చిన మావోయిస్టులు కొన్ని టీమ్‌లుగా విడిపోయి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.
వెంకటాపురంలో బస్తర్ రేంజ్ ఐజీ
ములుగు జిల్లా పరిధిలోని అడవుల్లో ఇంతపెద్ద స్థాయిలో కూంబింగ్ జరగడం ఇదే తొలిసారి అని వారు అంటున్నారు.కర్రెగుట్టలకు సమీపంలో ఉండే రాంపురం, భీమారంపాడు గ్రామాలు పోలీసుల ఆంక్షలతో నిర్మానుష్యంగా మారాయి. ఎవరినీ ఆ గ్రామాల్లోకి రానివ్వడం లేదు. బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్‌రాజ్ ములుగు జిల్లాలోని వెంకటాపురం నుంచే ‘బచావో కర్రెగుట్టలు’ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆయన వెంట ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.