Bandi Sanjay: తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయండి: బండి సంజయ్
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల కారణంగానే పనులకు ఆటంకం ఏర్పడిందని గడ్కరీ తెలిపారు.
- By Gopichand Published Date - 05:04 PM, Mon - 28 July 25

Bandi Sanjay: తెలంగాణలో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. న్యూఢిల్లీలో గడ్కరీని కలిసిన బండి సంజయ్.. మొత్తం రూ.113 కోట్లతో కూడిన సీఆర్ఐఎఫ్ ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ ప్రతిపాదనల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బావుపేట-ఖాజీపూర్ రోడ్డులో మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి-పోతూర్ రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయి. వీటితో పాటు చందుర్తి నుండి మోత్కురావుపేట వరకు (కిమీ 5/0 నుండి 8/450 వరకు) వంతెనల నిర్మాణం, కిష్టంపల్లి వరకు రోడ్డుపై వంతెన నిర్మాణం, శంకరపట్నం మండలంలోని అర్కాండ్ల నుండి కన్నాపూర్ వరకు వరద కాలువపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
కరీంనగర్-జగిత్యాల రోడ్డు విస్తరణ పనులపై చర్చ
అనంతరం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్-జగిత్యాల విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని బండి సంజయ్ కోరారు. గత ఎన్నికలకు ముందే కరీంనగర్ నుండి జగిత్యాల వరకు 4 లేన్ల విస్తరణ కోసం కేంద్రం రూ.2151.35 కోట్ల నిధులతో ప్రతిపాదనలు రూపొందించిందని గుర్తు చేశారు. ప్రతిపాదనలకు ఆమోదం పొంది, టెండర్ ప్రక్రియ ప్రారంభమై చాలా నెలలు అవుతున్నా, పనులు ప్రారంభం కాకపోవడంపై గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌కు గాయం.. ఎలా అయ్యాడో చూడండి!
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల కారణంగానే పనులకు ఆటంకం ఏర్పడిందని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఆ అడ్డంకులన్నీ అధిగమించి నివేదికను కమిటీకి పంపించామని, కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అతి త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులు విడుదలపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు.