Hyderabad: ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా భక్తుల ఉత్సాహానికి తడసే లేదు. పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ బడా గణేశ్‌ను దర్శించేందుకు తరలివస్తున్నారు.
- By Latha Suma Published Date - 11:54 AM, Wed - 27 August 25

Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి ‘శ్రీ విశ్వశాంతి మహా గణపతి’ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వయంగా ఉత్సవ విగ్రహానికి తొలిపూజ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా భక్తుల ఉత్సాహానికి తడసే లేదు. పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ బడా గణేశ్‌ను దర్శించేందుకు తరలివస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో తయారైన ఈ విగ్రహం ఆద్యంతం శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈసారి గణేశుడికి కుడివైపున శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమవైపు ఖైరతాబాద్ గ్రామదేవత గజ్జలమ్మ అమ్మవారు కొలువుతీరి ఉన్నారు.
అదేవిధంగా, మహాగణపతి పక్కన పూరిజగన్నాథ స్వామి మరియు లక్ష్మీ సమేత హరిగ్రీవ స్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మహాగణపతికి 75 అడుగుల జంధ్యం, చేనేత కండువా, గరిక మాలలు సమర్పించామని పద్మశాలి సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్ తెలిపారు. గణపతితో పాటు అమ్మవార్లకు కూడా పట్టువస్త్రాలు సమర్పించి శోభాయమానంగా అలంకరించామని చెప్పారు. శిల్పకళాకారుడు చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో రెండు నెలల పాటు 150 మంది కళాకారులు శ్రమించి ఈ విగ్రహాన్ని మట్టితో తీర్చిదిద్దారు. ఈ ఏడాది గణేశుడు మూడు ముఖాలతో, పంచముఖ నాగేంద్రుడి నీడలో నిలబడిన ఆకారంలో రూపొందించబడ్డాడు. ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా నామకరణం చేసిన ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
గణేశుడు దర్శించుకునేందుకు రోజుకు సగటున 1.5 లక్షల మంది భక్తులు వస్తారని, వారాంతాల్లో ఈ సంఖ్య 5–6 లక్షల వరకు చేరే అవకాశం ఉందని సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయబడినట్టు పేర్కొన్నారు. మెట్రో స్టేషన్, ఖైరతాబాద్ రైల్వే గేట్, రాజ్‌దూత్ చౌరస్తా, మింట్ కాంపౌండ్ వంటి ముఖ్య మార్గాల ద్వారా భక్తులు వరుసగా రావాలని, తిరిగి వెళ్ళేలా సరైన మార్గాలను రూపొందించినట్టు తెలిపారు. సమగ్ర భద్రత కోసం ఆరుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 52 మంది ఎస్‌ఐలు, 50 మంది మహిళా పోలీసులు, 22 ప్లాటూన్లు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, షీటీమ్స్ సహా మొత్తంగా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాక, నగరానికి సాంస్కృతికంగా గర్వకారణంగా నిలుస్తోంది. ఉత్సవాలు ఇంకా కొన్ని రోజులు కొనసాగనున్న వేళ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుంటున్నారు.
Read Also: New World Screwworm (NWS) : అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి!