Food Safety : మూసాపేటలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. రెస్టారెంట్‌లో బయటపడిన షాకింగ్ లోపాలు
- Author : Prasad
Date : 27-05-2026 - 12:47 IST
Published By : Hashtagu Telugu Desk
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత పర్యవేక్షణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మూసాపేటలోని ఓ రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు బయటపడటంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. తనిఖీల సమయంలో వంటగది నేల జారుడుగా ఉండటం, డ్రైనేజీ వ్యవస్థలో ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, వండిన వెజ్ బిర్యానీ, అన్నం, పన్నీర్, మంచూరియా, పిండి పదార్థాలను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అలాగే వంటగది పరిసరాల్లో బొద్దింకలు, ఈగలు సంచరిస్తున్నట్లు గుర్తించారు.
ఆహార పదార్థాల నిల్వ కంటైనర్లు అపరిశుభ్రంగా ఉండటం, సిబ్బంది హెయిర్‌నెట్స్, మాస్కులు ధరించకపోవడం, వైద్య రికార్డులు, నీటి నాణ్యత నివేదికలు అందుబాటులో లేకపోవడం వంటి పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి. అంతేకాకుండా గడువు ముగిసిన ఫుడ్ లైసెన్స్‌తో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే ఆ రెస్టారెంట్‌ను మూసివేసి, నిల్వ ఉంచిన పాత వెజ్ బిర్యానీ, మంచూరియా వంటి ఆహార పదార్థాలను తొలగించారు. పరిశుభ్రత ప్రమాణాల ప్రకారం ఆ సంస్థకు కేవలం 40/116 హైజీన్ స్కోర్ మాత్రమే నమోదైనట్లు వెల్లడించారు. సైబరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార సంస్థల్లో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.