MGBS: MGBS బస్టాండ్ లో తగ్గిన వరద.. పేరుకున్న బురద
MGBS: నది నీరు ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరి బస్సుల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంది. ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్లాట్ఫాంలు, వేచివుండే గదులు, పార్కింగ్ ప్రదేశాలు అన్నీ వరదనీటితో నిండిపోయాయి
- By Sudheer Published Date - 02:45 PM, Sun - 28 September 25

భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్ స్టేషన్‌గా పేరుగాంచిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) కూడా ఈ వరదకు మినహాయింపు కాలేదు. నది నీరు ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరి బస్సుల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంది. ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్లాట్ఫాంలు, వేచివుండే గదులు, పార్కింగ్ ప్రదేశాలు అన్నీ వరదనీటితో నిండిపోయాయి.
Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!
ఇప్పుడిప్పుడు పరిస్థితి కొంత సర్దుకున్నా, వరద నీరు తగ్గిపోవడంతో బురద, చెత్త పేరుకుపోయింది. ముఖ్యంగా 56, 58, 60వ ప్లాట్ఫాంల వద్ద కుప్పలుతెప్పలుగా బురద ఉండటం వల్ల అక్కడ బస్సులను నిలిపే అవకాశం లేకపోతోంది. సిబ్బంది యుద్ధప్రాతిపదికన శుభ్రపరిచే పనులు చేపట్టారు. చెత్త, బురద పూర్తిగా తొలగించాక మాత్రమే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులను లోపలికి అనుమతించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదిలావుంటే మూసారాంబాగ్, ఛాదర్ ఘాట్ బ్రిడ్జిలపై కూడా వరద తగ్గిపోయింది. చెత్త క్లియర్ చేసిన తర్వాత రాకపోకలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ సంఘటన నగర మౌలిక వసతులపై ప్రశ్నార్థక చిహ్నం ముద్రించింది. భారీ వర్షాలు వచ్చినప్పుడు జలమయమయ్యే ప్రాంతాల జాబితాలో ఎంజీబీఎస్ కూడా చేరడం ఆందోళనకరం. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికుల సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. వరద సమయంలో అత్యవసర సదుపాయాలు, నీటి పారుదల మార్గాలు, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తే ఇలాంటి ఇబ్బందులను తక్కువ సమయంలో ఎదుర్కొని పరిష్కరించవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.