AI Training For Journalists: తెలంగాణలో జర్నలిస్టులకు తొలి ఏఐ శిక్షణ!
చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, నోట్‌బుక్ ఎల్‌ఎం, గూగుల్ జెమినీ, మిడ్ జర్నీ, సోరా, వీఈఓ3 వంటి ఏఐ టూల్స్‌ను ఎలా ఉపయోగించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
- By Gopichand Published Date - 06:47 PM, Wed - 3 September 25

AI Training For Journalists: కృత్రిమ మేధస్సు (AI) పరిజ్ఞానంతో జర్నలిస్టుల నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ మీడియా అకాడమీ పనిచేస్తున్నదని అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఏఐ సాంకేతికత (AI Training For Journalists) జర్నలిస్టులకు తప్పనిసరి అయినప్పటికీ దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని అంతర్జాతీయ శిక్షకుడు ఉడుముల సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో జర్నలిస్టులకు తొలి ఏఐ శిక్షణ
బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో తెలంగాణ మీడియా అకాడమీ- అదిరా (ADIRA) డాటా లీడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు (AI) టూల్స్, టెక్నిక్స్‌పై ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లకు చెందిన తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలకు సంబంధించిన దాదాపు 100 మందికి పైగా జర్నలిస్టులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజం రంగంలో ఏఐ వాడకం పెరిగిందని, దీనివల్ల న్యూస్ రూమ్‌లు కూడా మారాయని అన్నారు. కాబట్టి జర్నలిస్టులు ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఏఐని ఉపయోగించడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని పాఠకులు, వీక్షకులకు అందించవచ్చని ఆయన చెప్పారు.
Also Read: Hema Malini: బాలీవుడ్ నటి గ్యారేజీలో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
ఏఐ వల్ల ప్రమాదాలు ఉన్నాయి
అంతర్జాతీయ శిక్షకుడు ఉడుముల సుధాకర్ రెడ్డి ఈ వర్క్‌షాప్‌లో శిక్షణ ఇచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏఐ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, తెలంగాణలో జర్నలిస్టులకు ఏఐపై శిక్షణ ఇవ్వడం ఇదే మొదటి ప్రయత్నమని ఆయన అన్నారు. జర్నలిస్టులు నిత్య విద్యార్థుల్లా ఉండాలని, తాను కూడా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని చెప్పారు.
ఏఐ టూల్స్ వల్ల కలిగే లాభాలు, ప్రమాదాలు, ఏఐ పద్ధతులు, నియమ నిబంధనలు, ప్రాథమిక అంశాలపై సుధాకర్ రెడ్డి విస్తృతంగా వివరించారు. ఏఐ మనసును భ్రమింపజేసి తప్పుడు సమాచారం లేదా వివక్షతో కూడిన సమాచారాన్ని అందించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐ అవుట్‌పుట్ టూల్స్ కూడా జాతి, మత, వర్గ, లింగ భేదాలు కలిగించే కంటెంట్‌ను ఇస్తాయని ఉదాహరణలతో వివరించారు.
ఆటోమేషన్లో భాగంగా ఏఐ ఏజెంట్స్ వస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, నోట్‌బుక్ ఎల్‌ఎం, గూగుల్ జెమినీ, మిడ్ జర్నీ, సోరా, వీఈఓ3 వంటి ఏఐ టూల్స్‌ను ఎలా ఉపయోగించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏఐ డాటా ట్రైనింగ్‌లో లోపం లేదా ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ సరిగా చేయకపోవడం వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని ఆయన చెప్పారు. జర్నలిస్టులు ఏఐ నైతిక నియమాలకు లోబడి, బాధ్యతాయుతంగా ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.