Hyderabad: హైదరాబాద్ నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
- Author : Balu J
Date : 13-04-2024 - 7:34 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్లో నీటి సమస్యలపై స్పందించటానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడిన 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసవి లో నీటి ఇబ్బంది ఉంది. గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకి 2300 mld సప్లై చేస్తే ఇప్పుడు 2450 mld నీరు సరఫరా చేస్తున్నామని పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇంచార్జి మినిస్టర్ తెలిపారు.
‘‘హైదరాబాదులో 700 ట్యాంకర్ల నీరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. నాగార్జున సాగర్,ఎల్లం పల్లి, హయత్ సాగర్, ఉస్మాన్ సాగర్,సింగూర్ లో నీటి నిలువలు ఉన్నాయ్. ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని డ్రా చేస్తున్నాం’’ అని మంత్రి పొన్నం అన్నారు.
కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి కొరత లేదని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ స్పష్టం చేశారు. సిటీకి నీళ్లు సప్లై చేసే జలాశయాల్లో అవసరమైన మేరకు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఒక నాగార్జునసాగర్‌లో ఉన్న నీళ్లే హైదరాబాద్ సిటీకి ఏడాది పాటు సరిపోతాయన్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాటర్ సప్లై చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.