DS Formal Rites: రేపు నిజామాబాద్‌లో అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు..!
- By Gopichand Published Date - 10:10 AM, Sat - 29 June 24

DS Formal Rites: గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీమంత్రి డి.శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన పార్ధివదేహాన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ కు తరలిస్తారు. రేపు (ఆదివారం) మధ్యాహ్నం డిఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు (DS Formal Rites) జరగనున్నట్లు డిఎస్ కుటుంబ సభ్యులు తెలియజేశారు.
అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కు (డీఎస్) అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. డీఎస్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే మాజీ మంత్రి డీఎస్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read: MP Dharmapuri Arvind : ‘‘ఐ విల్ మిస్ యూ డ్యాడీ’’.. డీఎస్ కుమారుడు ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్
సీఎం రేవంత్ సంతాపం
మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
We’re now on WhatsApp : Click to Join