యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?
రైతులు ఇంటి వద్ద నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'ను తీసుకొచ్చింది. ఇప్పటికే 10 జిల్లాల్లో ఇది అందుబాటులోకి రాగా, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది
- Author : Sudheer
Date : 21-12-2025 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
- రైతుల కోసం ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’
- రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన యాప్ తో రైల్తుల కష్టాలు తీరినట్లే
- రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ విధానం
తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఎరువుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, పారదర్శకమైన విధానంలో యూరియాను పొందేందుకు ప్రభుత్వం ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో ఎరువుల కొనుగోలు సమయంలో డీలర్ల వద్ద ఏర్పడే రద్దీని, కృత్రిమ కొరతను అరికట్టడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ విధానం, రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని రైతులకు అందుబాటులోకి రానుంది. దీనివల్ల రైతులు తమ ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా తమకు కావలసిన ఎరువులను సులభంగా ముందస్తు రిజర్వ్ చేసుకునే వెసులుబాటు కలిగింది.

Telangana Urea App
ఈ విధానంలో ఎరువులు పొందాలనుకునే రైతులు తమ సాగు విస్తీర్ణం (Pattadar Passbook) వివరాల ఆధారంగా యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతు తన వద్ద ఉన్న భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంట రకాన్ని బట్టి ఎంత మోతాదులో ఎరువులు అవసరమో యాప్ స్వయంగా లెక్కిస్తుంది. దీనివల్ల అవసరానికి మించి ఎరువులు నిల్వ చేసే ధోరణి తగ్గడమే కాకుండా, అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో యూరియా అందుతుంది. రైతులు తమ ఆధార్ నంబర్ మరియు ఫోన్ నంబర్‌తో లాగిన్ అయ్యి, తమకు సమీపంలో ఉన్న ఫర్టిలైజర్ డీలర్‌ను ఎంచుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
అయితే, ఈ బుకింగ్ ప్రక్రియలో సమయపాలన అత్యంత కీలకం. ఒకసారి రైతులు యాప్‌లో యూరియాను బుక్ చేసుకున్న తర్వాత, సరిగ్గా 24 గంటల లోపు సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి ఎరువులను సేకరించాలి. నిర్ణీత గడువులోగా ఎరువులు తీసుకోని పక్షంలో, ఆ బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. తద్వారా ఆ నిల్వలు ఇతర రైతులకు అందుబాటులోకి వస్తాయి. ఈ నిబంధన వల్ల ఎరువుల పంపిణీ వేగవంతం అవడమే కాకుండా, బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డుకట్ట పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.