Indiramma Sarees: మహిళా సంఘాల సభ్యులకే ఇందిరమ్మ చీరల పంపిణీ?
ప్రభుత్వం ఈ పథకంతో పాటు నేత కార్మికులకు ఉన్న రూ. 500 కోట్ల పాత బకాయిలను కూడా క్లియర్ చేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో 65 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లతో సహా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఆర్డర్లను సిరిసిల్లకే కేటాయించింది.
- By Gopichand Published Date - 02:20 PM, Fri - 19 September 25

Indiramma Sarees: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేత కార్మికులకు కొత్త ఊపిరి పోసింది. రాష్ట్రంలో అత్యధిక మరమగ్గాలు ఉన్న ఈ జిల్లాకు ప్రభుత్వం ఈ పథకం కింద 95 శాతం ఆర్డర్లను కేటాయించింది. దీనితో సుమారు 9,300 పవర్‌లూమ్స్‌పై చీరల (Indiramma Sarees) తయారీ మొదలైంది. ఇది 15 వేల మందికి పైగా నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన బతుకమ్మ చీరల నాణ్యతపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మార్చి ఇందిరా మహిళా శక్తి చీరల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 1.30 కోట్ల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు అందించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గత ఏడాది నవంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో ఈ పథకాన్ని ప్రకటించారు.
భారీ ఆర్డర్లతో నేతన్నలకు భరోసా
ప్రభుత్వం మొదటి విడతలో 4.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఆర్డర్‌తో సిరిసిల్ల నేతన్నలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెస్కో జీఎం అశోక్ రావు ఈ ఆర్డర్ కాపీని సిరిసిల్ల చేనేత, జౌళి శాఖ ఏడీకి అందజేశారు. ఏప్రిల్ 30లోగా చీరల తయారీ పూర్తి చేసి ఇవ్వాలని అధికారుల సూచించారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణలో ట్రంప్‌లాంటి పాలన సాగదు: సీఎం రేవంత్ రెడ్డి
ఇప్పటికే 3 కోట్ల మీటర్ల ఉత్పత్తి పూర్తయింది. ఇందులో 2.70 కోట్ల మీటర్ల ఉత్పత్తిని ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. మిగతా ఉత్పత్తి పూర్తయిన వెంటనే చీరల పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం మొదట సెప్టెంబర్ 23 నుంచి పంపిణీ మొదలుపెడతామని ప్రకటించినప్పటికీ, తయారీ పూర్తి కాకపోవడంతో పంపిణీ తేదీని ఇంకా ప్రకటించలేదు.
పాత బకాయిలు క్లియర్, ఏడాది పొడవునా ఉపాధి
ప్రభుత్వం ఈ పథకంతో పాటు నేత కార్మికులకు ఉన్న రూ. 500 కోట్ల పాత బకాయిలను కూడా క్లియర్ చేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో 65 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లతో సహా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఆర్డర్లను సిరిసిల్లకే కేటాయించింది. ఈ నిర్ణయాల వల్ల నేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుందని, ఆర్థికంగా నిలదొక్కుకుంటారని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఒకే రంగు, ఒకే డిజైన్‌తో ఒక మహిళకు ఒక చీరను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.