Medigadda Flaws Exposed : మేడిగడ్డ లోపాల పుట్ట.. ఐఐటీ రూర్కీ అధ్యయనంలో వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Flaws Exposed). దీనికి మూలస్తంభమైన సీకెంట్ పైల్స్లోనూ లోపాలు ఉన్నాయి.
- Author : Pasha
Date : 29-01-2025 - 7:52 IST
Published By : Hashtagu Telugu Desk
Medigadda Flaws Exposed : బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై ఐఐటీ రూర్కీ సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ బ్యారేజీలోని డిజైన్లు, మోడల్ స్టడీస్, జియో టెక్నికల్ అంశాలు లోపాల పుట్టగా ఉన్నాయని తేల్చింది. దీన్ని నిర్మించే ముందు సరైన పరిశోధన చేయలేదని ఐఐటీ రూర్కీ నిపుణులు వెల్లడించారు. హైడ్రాలజీ, హైడ్రాలిక్స్ (గేట్లకు సంబంధించిన అంశాలు), జియోటెక్నికల్ డిజైన్లపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికలోని కీలకమైన అంశాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Caste Survey : కులగణన సర్వే తుది నివేదిక.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఐఐటీ రూర్కీ నివేదికలోని కీలక వివరాలివీ..
- కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Flaws Exposed). దీనికి మూలస్తంభమైన సీకెంట్ పైల్స్లోనూ లోపాలు ఉన్నాయి.
- బ్యారేజీకి సంబంధించిన పలు పనులను ‘ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్’ ప్రకారం చేపట్టలేదు.
- మేడిగడ్డ బ్యారేజీలోని 11 గేట్ల వద్ద జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. కానీ 5 గేట్ల వద్దే ఈ టెస్టులు చేశారు. బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో 33, 34, 35, 36, 37వ నంబర్ గేట్ల వద్ద బోర్ హోల్స్ టెస్టులు చేశారు. 24 మీటర్ల నుంచి 26 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్ తవ్వి, టెస్టులను నిర్వహించారు. ఐఎస్ కోడ్స్ ప్రకారం గేట్ల వద్ద జియో టెక్నికల్ పరిశోధన చేయలేదు.
- సీకెంట్ పైల్స్ కటాఫ్ (బ్యారేజీలో లీకేజీలు, సీపేజీలు ఏర్పడకుండా భూమిలోపల ఏర్పాటు చేసే ఫౌండేషన్‌లాంటి ప్రొటెక్షన్ వాల్) ఐఎస్ కోడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గుర్తించారు. సీకెంట్పైల్స్పై పడే వరద ప్రవాహ ఒత్తిడిని లెక్కలోకి తీసుకోకుండానే వాటిని నిర్మించారు.
- అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్‌లలో రాక్ మ్యాపింగ్ చేయకుండానే సీకెంట్ పైల్స్‌ను నిర్మించారు.
- లాంచింగ్ ఆప్రాన్ మందం బ్యారేజీ వరదలకు సరిపోదని గుర్తించారు. దిగువన ఒక మీటర్, ఎగువన 1.2 మీటర్ల మందంతోనే లాంచింగ్ ఆప్రాన్లను ఏర్పాటు చేశారు.
- ఐఎస్ కోడ్స్ స్టాండర్డ్స్ ప్రకారం కనీసం 1.86 మీటర్ల మందం ఉండాలి. అయితే సీసీ బ్లాకుల పొడవు కూడా సరిపోనూ లేదని నివేదికలో పొందుపరిచారు.
- బ్యారేజీ ఫౌండేషన్ సీకెంట్ పైల్స్‌ను సరిగ్గా నిర్మించలేదు. దిగువన రాఫ్ట్, పైల్స్‌కు మధ్య కనెక్షన్ లేక రంధ్రాలు పడ్డాయి. చివరకు లీకేజీకి దారి తీసింది.
- బ్యారేజీని నిర్మించే క్రమంలో ఇసుక సెడిమెంటేషన్‌తో పాటు మరికొన్ని స్టడీస్ చేయలేదు.