Gachibowli land issue : ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదు: సుప్రీంకోర్టు
ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది.
- By Latha Suma Published Date - 05:25 PM, Thu - 3 April 25

Gachibowli land issue : హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలను అమికస్ క్యూరీ.. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది.
Read Also: Jhukunga Nahin : ‘‘తగ్గేదేలే’’ అంటూ రాజ్యసభలో ఖర్గే హూంకారం.. ఎందుకంటే..
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది.
అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అటవీ భూమి అని ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. తాజాగా మరోసారి ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలు అన్నీ నిలుపుదల చేయాలని ఆదేశించింది.