Crop Loss: తెలంగాణ లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Crop Loss: ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి.
- By Sudheer Published Date - 07:36 AM, Sat - 30 August 25

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న అతివృష్టి రైతులకు పెద్ద కష్టాలను తెచ్చిపెడుతోంది. జూన్, జూలై నెలల్లో విత్తిన పంటలు ఇంకా బలంగా నిలబడకముందే వరదలతో దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి. పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండడంతో మొక్కలు పాడవుతున్నాయి. కలుపు పెరగడంతో అదనపు ఖర్చులు పెరుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Telangana Local Body Elections : స్థానిక ఎన్నికలపై ఇవాళ తుది నిర్ణయం!
కేవలం కామారెడ్డి జిల్లాలోనే దాదాపు 94 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని అధికారులు వెల్లడించారు. నిజామాబాద్, సిద్దిపేట, నిర్మల్, ఖమ్మం, మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 13 జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయాయని అంచనా. చెరువులు పొంగిపొర్లడంతో కట్టలు తెగిపోవడం, రహదారులు దెబ్బతినడం, కొన్ని పంటలు పూర్తిగా మాయమవ్వడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
TG Assembly Session : రేపటి నుంచి అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?
ప్రస్తుతం రాష్ట్రంలో పంటల బీమా పథకం లేకపోవడంతో, ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల పరిహారం చెల్లించే ఆలోచనలో ఉంది. ఇందుకు కనీసం రూ.200 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితేనే రైతులకు పరిహారం అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసి, క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాలని ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.