MLA Quota MLCs: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్
వీటిలో ఒక దాన్ని సీపీఐ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్(MLA Quota MLCs) నిర్ణయించింది.
- Author : Pasha
Date : 09-03-2025 - 7:13 IST
Published By : Hashtagu Telugu Desk
MLA Quota MLCs: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోస్టుల భర్తీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దీనిపై ముఖ్య ప్రకటన వెలువరించారు. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి. వీటిలో ఒక దాన్ని సీపీఐ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్(MLA Quota MLCs) నిర్ణయించింది. ఇక మిగతా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్‌ల పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Also Read :SSMB29 Leak : ఆయన ఎదుట మోకరిల్లిన మహేశ్‌బాబు.. ‘ఎస్ఎస్ఎంబీ-29’ లీక్
ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓటింగ్‌పై సస్పెన్స్
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 10 (సోమవారం)తో గడువు ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు ఛాన్స్ ఇస్తారు. 20న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు రిలీజ్ అవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రాతిపదికన కాంగ్రెస్‌కు మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది. సీపీఐకు కేటాయించిన ఎమ్మెల్సీ సీటులో విజయం కోసం మజ్లిస్ పార్టీ మద్దతు తప్పక అవసరం.బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కూడా సీపీఐ అభ్యర్థికి మద్దతు పలకాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారా ? పాల్గొంటే ఎటువైపు ఓటు వేస్తారు ? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మొత్తం మీద సీపీఐ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థి టఫ్ ఫైట్‌ను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒక స్థానంలో బీఆర్‌ఎస్ గెలవడం ఖాయం.