MLAs Progress Report: సీఎం రేవంత్ చేతిలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. వాట్స్ నెక్ట్స్ ?
రాష్ట్ర ప్రభుత్వం(MLAs Progress Report) తరపున అన్నీ చేశాం.. మీ తరఫున ఏమేం చేశారో చెప్పండని ఎమ్మెల్యేలను సీఎం అడిగినట్లు సమాచారం.
- By Pasha Published Date - 05:38 PM, Sat - 3 May 25

MLAs Progress Report: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనా కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు వివరాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ప్రజలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమేర అందుబాటులో ఉన్నారు ? ఉచిత హామీల అమలుపై నియోజకవర్గ స్థాయిలో ఎంతమేర శ్రద్ధ పెట్టారు? అర్హులకు ఉచిత హామీ పథకాలు అందేలా చేసేందుకు ఎంతమేర కసరత్తు చేశారు ? కాంగ్రెస్ పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు నడుస్తున్నారా.. లేదా ? అసెంబ్లీ స్థానాలకు కేటాయించిన నిధులను ఎంతమేర వినియోగించారు ? ఎలా వినియోగించారు ? కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ఎంతమేర ప్రోత్సహించగలిగారు ? వంటి అంశాలన్నీ ప్రోగ్రెస్ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేను తన వద్దకు పిలుచుకొని ఈ నివేదికపై సీఎం రేవంత్ సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నర పాలనా కాలంలోనే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అటువంటి స్థితిని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ కౌన్సెలింగ్ చేసి, తగిన గైడెన్స్ ఇస్తున్నారట. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వం చేస్తున్న పని గురించి అందరికీ వివరించాలని రేవంత్ సూచిస్తున్నారట.
సొంత జిల్లా నుంచే మొదలుపెట్టిన సీఎం
తొలుత తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ప్రాధాన్యత ఇచ్చారు. గురువారం రోజు ఆయన తన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే అందరినీ ఒకేసారి కూర్చోపెట్టి మాట్లాడకుండా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిస్థితులపై సదరు ఎమ్మెల్యేలతో విడివిడిగా రేవంత్ చర్చించారు. గత 17 నెలల్లో ఆయా అసెంబ్లీ స్థానాల్లో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను ఆయా ఎమ్మెల్యేల ముందు సీఎం రేవంత్ పెట్టినట్లు తెలిసింది.
మీ తరఫున ఏమేం చేశారో చెప్పండి ?
రాష్ట్ర ప్రభుత్వం(MLAs Progress Report) తరపున అన్నీ చేశాం.. మీ తరఫున ఏమేం చేశారో చెప్పండని ఎమ్మెల్యేలను సీఎం అడిగినట్లు సమాచారం. పథకాల ప్రచారం కోసం మీరు చేసిన ప్రయత్నమేంటి ? ఎన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు ? ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు? పార్టీ కార్యకర్తలతో ఎన్ని సార్లు మీటింగ్లు పెట్టారు ? అనే అంశాలపై ఎమ్మెల్యేలను రేవంత్ ఆరా తీశారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను పేపర్‌పై రాసివ్వాలని సీఎం అడిగినట్టు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్పకుండా.. తమకు తెలిసిన కాంట్రాక్టర్ల బిల్లులను రిలీజ్ చేయించాలని అడిగినట్లు సమాచారం. నియోజకవర్గంలోని డెవలప్‌మెంట్ పనులపై ఫోకస్ పెట్టాలని అలాంటి వారికి సీఎం హితవు పలికారట.
టార్గెట్ జూన్ 2
ఈ ఏడాది జూన్ 2లోగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ విడివిడిగా ఈవిధంగా సమావేశాలు నిర్వహిస్తారట. ఆ తరువాత ఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు అవసరమైన చోట్లలో కొత్త పనులను సీఎం ప్రారంభిస్తారని అంటున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారని అంచనా వేస్తున్నారు. మొత్తంమీద ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల వ్యవహారంతో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైందట.