CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కీలక బాధ్యతలు.. రాహుల్‌గాంధీ టార్గెట్ అదే!
తెలంగాణలోని సీఎం రేవంత్(CM Revanth Reddy) సర్కారు కూడా ఈవిషయంలో ప్రజల్లో మంచి మార్కులు సంపాదించింది.
- By Pasha Published Date - 08:02 PM, Mon - 20 January 25

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి .. తెలంగాణకు ముఖ్యమంత్రి మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బాగా విశ్వసించే కొద్ది మంది ముఖ్య నేతల జాబితాలో రేవంత్ కూడా ఉంటారు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ఎన్నికల కోసం రేవంత్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించారు. ఆయనతో పాటు మరో 39 మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఢిల్లీలో ప్రచారం చేయనున్నారు.ఇది పాత విషయమే. కొత్త అప్‌డేట్ ఏమిటో తెలియాలంటే వార్త మొత్తం చదవండి.
Also Read :UK Vs India : బ్రిటన్‌లోని 10 శాతం సంపన్నుల వద్ద భారత సంపద.. ఎందుకు ?
తెలంగాణ, కర్ణాటక, హిమాచల్..
ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంక్షేమ పథకాల పేరుతో ఊదరగొడుతోంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి టఫ్ ఫైట్ ఎదురవుతుండటంతో ఆప్‌లో వణుకు మొదలైంది. అందుకే రోజుకో కొత్త స్కీంను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఉచిత హామీల అమలులో ఆప్ రారాజు అని కేజ్రీవాల్ సొంత డప్పు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి దేశంలో ఉచిత హామీల అమలు క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే దక్కాలి. తెలంగాణ అయినా.. కర్ణాటక అయినా.. హిమాచల్ ప్రదేశ్ అయినా.. ఉచిత హామీల అమలు కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే సాధ్యం. ఇదే నిజం. మచ్చుకు మనం చెప్పుకున్న ఈ మూడు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉచిత హామీలను అమలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును అక్కడి ప్రభుత్వాలు, కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
Also Read :PAN Card Linked Loans : మీ పాన్‌కార్డుతో లింక్ అయిన రుణాల చిట్టా.. ఇలా తెలుసుకోండి
ఢిల్లీ ప్రజలకు అర్థమయ్యేలా..
తెలంగాణలోని సీఎం రేవంత్(CM Revanth Reddy) సర్కారు కూడా ఈవిషయంలో ప్రజల్లో మంచి మార్కులు సంపాదించింది. ఉచిత బస్సు ప్రయాణ స్కీం, రైతు సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల స్కీం వంటివన్నీ రేవంత్ సారథ్యంలోనే పక్కాగా, పకడ్బందీగా అమలవుతున్నాయి. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ గుర్తించారు. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తూనే.. ఉచిత హామీల అమలులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ట్రాక్ రికార్డు గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని రేవంత్‌కు సూచించారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉచిత హామీల అమలుతో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది ఢిల్లీవాసులకు చెప్పాలని రేవంత్‌కు రాహుల్ నిర్దేశించారు. ఉచిత హామీలు వద్దు అని వాదించే బీజేపీ కన్నా.. అరకొర సంక్షేమ పథకాలతో సరిపెట్టే ఆప్ కన్నా.. కాంగ్రెస్ పార్టీయే ఉత్తమమైందని ప్రజలకు వివరించాలని రేవంత్‌కు రాహుల్ చెప్పారట.