Siddipet : కోకాకోలా కంపెనీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
- By Latha Suma Published Date - 03:59 PM, Mon - 2 December 24

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(సోమవారం)సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ గ్రామంలో కోకాకోలా సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రూ.1000 కోట్ల పరిశ్రమను ప్రారంభించారు. ఈ పరిశ్రమను 500 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక యంత్రాలతో నిర్మించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ తరహా పరిశ్రమలు రాష్ట్రానికి ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తాయని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని రావడానికి ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని చెప్పారు. ఇక ప్రారంభ దశలో 2000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. కోకాకోలా సంస్థ తెలంగాణకు పెట్టుబడుల కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావొస్తోంది. ఈ తరుణంలో కంపెనీని ప్రారంభించడం శుభపరిణామని అన్నారు.
ఇక గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.