CM Revanth New Demand: సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ నయా డిమాండ్!
రేవంత్ రెడ్డి ప్రతిపాదన మేరకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. త్వరలో చేప్టటనున్న నియోజకవర్గాల పునర్విభజనలోనూ ఏఐసీసీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
- By Gopichand Published Date - 08:00 AM, Fri - 27 December 24

CM Revanth New Demand: జన గణనలో కుల గణన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కుల గణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం (CM Revanth New Demand) తెలిపారు. బెళగావిలో గురువారం జరిగిన సీడబ్ల్యూసీ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కులగణన చేపట్టడం ద్వారా తెలంగాణ దేశానికే మార్గదర్శిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణనలో కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ పోరాటం చేయాలని ఆయన సూచించారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ ఒక తీర్మాన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
రేవంత్ రెడ్డి ప్రతిపాదన మేరకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. త్వరలో చేప్టటనున్న నియోజకవర్గాల పునర్విభజనలోనూ ఏఐసీసీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఏఐసీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో దానిపై కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉందని సీఎం సూచించారు. మహిళా బిల్లు విషయంలోనూ బీజేపీ రిజర్వేషన్లను తనకు అనుకూలంగా చేసుకునే అవకాశాలున్నందున కాంగ్రెస్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం అన్నారు.
Also Read: Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం.. ఈ రాష్ట్రంలో సెలవు!
కుల గణనతో విప్లవాత్మకమైన మార్పులు: మహేశ్ కుమార్ గౌడ్, పీసీసీ అధ్యక్షులు
రాహుల్ గాంధీ ఆలోచనలతో చేపట్టాలని నిర్ణయించిన కులగణన తో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఇది దేశం అంత స్వాగతించాల్సిన అంశమని అన్నారు. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదని అన్నారు.
కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దానిని ప్రారంభించడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బెళగావి సీడబ్ల్యూసీ సదస్సులో ఆయన ప్రసంగించారు. అత్యంత పకడ్బందీగా అన్ని వర్గాల ఆలోచనలను స్వీకరించి ఒక అద్భుతమైన ప్రశ్నావళి రూపొందించి తెలంగాణలో కుల గణన సర్వే చేపట్టామని, ఇప్పటికే 90 శాతం పూర్తయిందని ఆయన చెప్పారు.
బీజేపీ రాజ్యాంగాన్ని, చరిత్ర ను తిరగరాయలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో దేశానికి సేవలు, త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర కారుల, త్యాగ పురుషుల జీవితాలను నేటి తరానికి వివరించాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సరిగ్గా వంద ఏళ్ల క్రితం ఇదే బెళగావిలో మహాత్మా గాంధీని సీడబ్ల్యూసీ ఏఐసీసీ అధ్యక్షునిగా ఎన్నుకుందనియ ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత కాలంలో ఏ పదవిని స్వీకరించకపోయినప్పటికీ ప్రపంచమంతా నేటికీ ఆయన సిద్ధాంతాలను అనుసరించడానికి ఆయన పాటించిన విలువలు, ఆదర్శప్రాయమైన జీవనమే కారణమని పీసీసీ అధ్యక్షుడు కొనియాడారు.