CM Revanth Reddy : రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర : సీఎం రేవంత్
CM Revanth Reddy : దేశాన్ని రిజర్వేషన్ల రహితంగా చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
- By Pasha Published Date - 02:07 PM, Sat - 11 May 24

CM Revanth Reddy : దేశాన్ని రిజర్వేషన్ల రహితంగా చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే దేశంలో రిజర్వేషన్ల విధానం రద్దు కావడం ఖాయమన్నారు. అందుకే రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ఓటుహక్కును వినియోగించుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. పొరపాటున బీజేపీకి ఓటువేస్తే భావితరాలకు రిజర్వేషన్లు లేకుండా పోతాయన్నారు. ఈమేరకు వివరాలతో సీఎం రేవంత్ శనివారం మధ్యాహ్నం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఓటర్లు చైతన్యవంతంగా వ్యవహరించి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిని గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ‘‘ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు. ఇవి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు’’ అని రేవంత్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు వచ్చాయి. వారు వివిధ రంగాల్లో ఎదిగారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు సహా ఎన్నో హోదాల్లో వారంతా దేశానికి విలువైన సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులోనూ రిజర్వేషన్లు కొనసాగి.. మరెంతో మంది పైకి రావాలంటే బీజేపీని ఓడించి, ఇండియా కూటమిని గెలిపించాలి’’ అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ‘‘భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇద్దాం. ఇందుకోసం మన ఓటును వాడుదాం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.