CM Revanth Reddy : మరికాసేపట్లో ఖమ్మం కు సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది
- By Sudheer Published Date - 11:11 AM, Mon - 2 September 24

మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఖమ్మం (Khammam) నగరానికి రోడ్డు మార్గాన చేరబోతున్నారు. ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం (Munneru Vagu Water Folw Raising) దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది. వరద ఉధృతి కారణంగా ఖమ్మంలో కరుణగిరి వద్ద మున్నేరు వంతెన కంపించింది. నగరంలోని కవిరాజ్‌నగర్, వీడియోస్ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్ రోడ్డు, కాల్వ ఒడ్డు.. దాదాపు పదుల సంఖ్యలో కాలనీల్లోని వరద నీరు పోటెత్తింది.
We’re now on WhatsApp. Click to Join.
పలు చోట్ల వరదలో చిక్కుకున్నవారు.. సాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం నగరంలోని కల్యాణ్‌నగర్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. నడుముల్లోతు నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు. ఇక జలదిగ్బంధంలో చిక్కుకున్న చాలామందిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మున్నేరు పరీవాహక ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. పలు కాలనీల్లో అనేక ఇల్లు మునిగిపోయాయి.
ఇదే క్రమంలో ఖమ్మం నగరవాసులు ప్రభుత్వం ఫై , జిల్లా మంత్రుల ఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా వరదల నుంచి కాపాడేందుకు ఎందుకూ పనికిరారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇచ్చామని నాడు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా.. వాళ్లు మాత్రం మున్నేరు వరదల నుంచి దేవుడే ప్రజలను కాపాడాలని చేతులు ఎత్తివేశారని మండిపడుతున్నారు. తమను ఎవరు కాపాడుతారో తెలియక, రక్షించేవారికోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, బిల్డింగులపైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. తిండిలేక హహాకారాలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు గోదావరి, ఇటు మున్నేరు నదుల వరదల్లో చిక్కుకున్నట్టు వార్తలు వచ్చినా ముగ్గురు మంత్రులకు చీమకుట్టినట్టు కూడా లేదని జనాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ప్రజల నుండి ఆగ్రహపు జ్వాలలు రావడంతో సీఎం రేవంత్ హైదరాబాద్ నుండి ఖమ్మం కు బయలుదేరారు. మరికాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలు దేరి, ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
Read Also : Cyclone Alert : ముంచుకొస్తున్న మరో తుఫాన్ గండం ..