Census Report : అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
- By Latha Suma Published Date - 03:26 PM, Tue - 4 February 25

Census Report : తెలంగాణలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు. కర్ణాటక, బిహార్ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నమని సీఎం తెలిపారు.
Read Also: Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం
దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశాం. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బీసీలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది ఉన్నారు. ఈ నివేదికను సంక్షేమ విధానాల తయారీకి వినియోగిస్తాం.
జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికీ స్టిక్కర్ అంటించాం. ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇళ్లకంటే ఎక్కువ ఇళ్లలో సర్వే చేయలేదు. 8 పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశాం. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు పనిచేసి డేటా క్రోడీకరించారు. మొత్తంగా రూ. 125 కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించాం. మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సర్వే చేయించాం అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సర్వే ఆధారంగానే రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్లు అమలు అవుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.