CM Revanth Reddy: అత్యంత శక్తిమంతుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది.
- Author : Gopichand
Date : 29-03-2025 - 12:14 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Reddy: తన పరిపాలనా నైపుణ్యం.. ప్రభావంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యంత శక్తిమంతమైన నాయకునిగా నిలిచారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. తనదైన దూకుడుతో భారత రాజకీయాల్లో ఆయన చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంకు మెరుగుపడింది. ఒక ప్రాంతీయ నాయకుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భవించారు.
ఈ జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలోని ఇతర ప్రముఖులైన సీఎంల సరసన నిలిపింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీలక నాయకునిగా నిలిపేలా చేశాయి. శక్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.
Also Read: Myanmar Earthquake Updates: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 144కు చేరిన మృతుల సంఖ్య?
విధానపరమైన నిర్ణయాలతో
రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేయడం, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన దృఢమైన అభిప్రాయాలు కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం దక్కేలా చేశాయి.
పారదర్శకమైన పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడినందునే *ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శక్తిమంతుల జాబితా-2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుర్తింపు లభించిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఈ గుర్తింపుతో దేశ, తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి గారి బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.
భారతీయ శక్తిమంతులైన జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చోటు లభించడం భారత రాజకీయాల్లో కీలక మార్పునకు సంకేతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నారనడానికి ఇదే నిదర్శమని వారు పేర్కొన్నారు.