Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది
- By Sudheer Published Date - 05:55 PM, Thu - 16 May 24

మరోసారి తెలంగాణ వ్యాప్తంగా (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) పడబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో రెండు గంటలుగా విపరీతమైన వర్షం పడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను అలర్ట్ జారీ చేసారు. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వాతావరణ శాఖ ఆలా ప్రకటించిందో లేదో..హైదరాబాద్ లో రెండు గంటలుగా భారీ వర్షం పడుతుంది.
ఈ క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC కమిషనర్ రొనాల్డ్ రాస్ హెచ్చరించారు. భారీ వర్షం కురుస్తుండటం, నగరమంతా జలమయం కావడంతో.. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. అత్యవసరమైతే తప్ప.. ఇంటి నుంచి కాలు బయటపెట్టొద్దని తెలిపింది. ఇదే సమయంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. 040-21111111 లేదా 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొంది. నగరంలో మరో రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు కూడా నిండకుండల్లా నిండిపోవడంతో.. నగరవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join.
నాంపల్లి, సికింద్రాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా, ఐటీ కారిడార్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ ఉంది. దీంతోపాటు కూకట్‌పల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, బాచుపల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, యూసఫ్ గూడ, నిజాం పేట సహా పలు ప్రాంతాల్లో వర్షం రాకతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇటు ఉప్పల్ స్టేడియం లో ఈరోజు రాత్రికి SRH Vs GT మ్యాచ్ ఉంది. ఇప్పుడు ఈ వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందో లేదో అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న ఫ్యాన్స్ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. స్టేడియం బయట క్యూలో నిల్చున్న వారు తడిసి ముద్దయ్యారు. భారీ ఈదురు గాలులతో వర్షం కురుస్తుండటంతో స్టేడియం పరిసరాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు స్టేడియంలోని పిచ్ను కవర్లతో కప్పేశారు.
Read Also : Laya : అమెరికాలో అడుక్కుతింటు బ్రతుకుతుందనే వార్తలపై లయ క్లారిటీ..