CM KCR: ఐఏఎస్ కేడర్ రూల్స్‌లో మార్పులను విరమించుకోవాలి!
ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లేఖ రాశారు.
- By Balu J Published Date - 09:47 PM, Mon - 24 January 22

ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లేఖ రాశారు. కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ 1954 ప్రతిపాదిత సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, ఈ సవరణలు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయని కేసీఆర్ గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఏఐఎస్ అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేనిదే బదిలీపై కేంద్రం తీసుకోవడం ద్వారా రాష్ట్రాల పరిపాలనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది రాజ్యాంగ స్వరూపానికి మరియు సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఏఐఎస్ అధికారులను బాధ్యులుగా, జవాబుదారులుగా చేయాల్సిందిపోయి..వారిని మరింత నిరుత్సాహానికి గురిచేయడం, కేంద్రం చేత వేధింపుల దిశగా ఈ సవరణ ఉసిగొల్పుతుందని, ఈ విధానం ఏఐఎస్ అధికారుల ముందు రాష్ట్రాలను నిస్సహాయులుగా నిలబెడుతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 లోని నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ 1951 చట్టాన్ని పార్లమెంటు చేసిందని, దాని ప్రకారం భారత ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించిందని కేసీఆర్ అన్నారు.
రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఉండాలంటే, రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొన్న తర్వాతే రాజ్యాంగ సవరణలు చేపట్టాలనే నిబంధనను ఆర్టికల్ 368 (2) లో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారని, ఏఐఎస్ క్యాడర్ రూల్స్ (1954) సవరణల ద్వారా కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలపడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు.