CBI in MLC Kavita House : కవిత ఇంట్లో సీబీఐ అధికారులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించేందుకు
- Author : Maheswara Rao Nadella
Date : 11-12-2022 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించేందుకు సీబీఐ (CBI) అధికారులు ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) ఇంటికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో ఎనిమిది మంది అధికారుల బృందం కవిత (MLC Kavita) ఇంటికి వచ్చారు. ఇందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సీబీఐ విచారణ సందర్భంగా కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లే దారిని రెండువైపులా పోలీసులు క్లోజ్ చేశారు. సీబీఐ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అడ్వొకేట్లు ఉదయమే ఆమె ఇంటికి వెళ్లారు. పదకొండు గంటలకు విచారణ మొదలుకానున్న నేపథ్యంలో పదిన్నరకే అడ్వొకేట్ల టీమ్ కవిత ఇంటికి చేరుకుంది.
కవిత అడ్వొకేట్ల సమక్షంలోనే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని తెలుసుకోవడానికి అధికారులు ఆమెను విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిముందు రాత్రికిరాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.