Kavitha: కుమార్తెకి బిగ్ షాక్ ఇవ్వనున్న కేసీఆర్.. కవితకు షోకాజ్ నోటీసులు?
ఢిల్లీ మద్యం కేసులో ఆరు నెలలు తీహార్ జైల్లో గడిపిన కవిత, తన అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్‌ను అడిగితే, ఆయన వద్దని చెప్పారని తెలిపారు.
- By Gopichand Published Date - 12:25 PM, Thu - 29 May 25

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha)కు పార్టీ నుంచి బిగ్ షాక్ తగలనుంది. ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖ, శంషాబాద్ విమానాశ్రయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తాజాగా మరోసారి పార్టీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యల కారణంగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీఆర్ఎస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. కవిత తన లేఖలో పార్టీలో అంతర్గత కుట్రలు జరుగుతున్నాయని, కేసీఆర్ చుట్టూ “దెయ్యాలు” తిరుగుతున్నాయని, పార్టీని కొందరు నాయకులు బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యాఖ్యలు ఆమె సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కవిత
కవిత మీడియాతో మాట్లాడుతూ.. తన ఓటమికి పార్టీలోని కొందరు కోవర్టులే కారణమని, ఆమెపై తప్పుడు వార్తలు రాయించేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తన లేఖ లీక్ అవ్వడం వెనుక కొందరు నాయకుల చేతివాటం ఉందని, దానిని ప్రశ్నించగానే తనపై దాడులు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. “కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేవలం ట్వీట్లకే పరిమితం కాకుండా, పార్టీని బలోపేతం చేయాలి” అని ఆమె సూచించారు. బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, కొత్త పార్టీల అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
Also Read: Kavitha : ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారు : కవిత
ఢిల్లీ మద్యం కేసులో ఆరు నెలలు తీహార్ జైల్లో గడిపిన కవిత, తన అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్‌ను అడిగితే, ఆయన వద్దని చెప్పారని తెలిపారు. “నేను ఎప్పుడూ పదవులు అడగలేదు, కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తెలంగాణ జాగృతి ద్వారా పార్టీ చేయలేని పనులను నేను చేసి చూపించాను” అని ఆమె అన్నారు. “నేను కడుపులో బిడ్డతో తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాను. నన్ను విమర్శించే వారు ఏం చేశారో చెప్పాలి. నాతో పెట్టుకోవద్దు” అని ఆమె గట్టిగా హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి. పార్టీ ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి, నాయకుల బయటకు వరుసలతో సంక్షోభంలో ఉంది. కవిత వ్యాఖ్యలు పార్టీ ఐక్యతను మరింత దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అధిష్ఠానం కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కానీ అధికారిక ధ్రువీకరణ లేదు.