Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకముందే బిఆర్ఎస్ – కాంగ్రెస్ ఫైట్ ..?
Local Body Elections : కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గెలిచే అవకాశమున్న అభ్యర్థులను పార్టీ ఎంచుకుంటుందని తెలిపారు
- Author : Sudheer
Date : 16-06-2025 - 6:46 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) త్వరలో జరగనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. జూన్ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో స్థానిక నేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అనంతరం సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై జూన్ 17న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
WTC 2025-27 Schedule: డబ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు!
ఈ సందర్భంగా మంత్రి పార్టీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఎన్నికలకు మరో రెండు వారాలే మిగిలినందున, కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గెలిచే అవకాశమున్న అభ్యర్థులను పార్టీ ఎంచుకుంటుందని తెలిపారు. చిన్నపాటి లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ప్రజల్లోకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను తీసుకెళ్లే బాధ్యతను అన్ని స్థాయిల నేతలు తీసుకోవాలన్నారు. రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులు, సన్నాలపై ప్రకటించిన రూ.500 బోనస్ కూడా త్వరలో ఖాతాల్లో జమ కానున్నట్లు వెల్లడించారు.
Dhanush : ధనుష్ కోరికను పవన్ కళ్యాణ్ తీరుస్తాడా..?
మరోవైపు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత లేకుండానే ఎన్నికలకు వెళ్లడంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. కేంద్రానికి బిల్లులు పంపి చేతులు దులుపుకోవడం కాకుండా, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రాధాన్యత లేని పదవులు కట్టబెట్టి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై ఇటీవల మంత్రి సీతక్క వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీసాయి. అయితే తాను షెడ్యూల్ వచ్చేస్తుందని చెప్పలేదని, త్వరలో ఎన్నికలు జరుగుతాయని మాత్రమే వ్యాఖ్యానించానని ఆమె వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశంపై ఆసక్తి నెలకొంది.