Sarath Chandra Reddy : శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేశాక.. బీజేపీకి ‘అరబిందో’ 30 కోట్లు
Sarath Chandra Reddy - BJP : ఎలక్టోరల్ బాండ్ల స్కీం ద్వారా వెల్లువెత్తిన విరాళాల సమాచారంతో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ కంపెనీల మధ్య ఉండే అక్రమ సంబంధం అందరి ఎదుట బట్టబయలైంది.
- Author : Pasha
Date : 22-03-2024 - 11:36 IST
Published By : Hashtagu Telugu Desk
Sarath Chandra Reddy – BJP : ఎలక్టోరల్ బాండ్ల స్కీం ద్వారా వెల్లువెత్తిన విరాళాల సమాచారంతో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ కంపెనీల మధ్య ఉండే అక్రమ సంబంధం అందరి ఎదుట బట్టబయలైంది. తెరచాటున వివిధ కంపెనీలు ఏ విధంగా రాజకీయ పార్టీలతో సంబంధాలను నెరుపుతాయో తేటతెల్లమైంది. సుప్రీంకోర్టు చొరవతో ఈ వ్యవహారం వెలుగుచూసిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో తాజాగా లిక్కర్ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. గత శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, ఇప్పుడేమో గురువారం రాత్రి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
We’re now on WhatsApp. Click to Join
ఇదే స్కాంలో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి(Sarath Chandra Reddy – BJP) సంబంధించిన ఒక కీలక విషయం తాజాగా వెల్లడైంది. ఆవిషయాన్ని తెలుసుకునే ముందు ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టయిన డేట్‌ను మనం తెలుసుకోవాలి. ఆయనను 2022 సంవత్సరం నవంబరు 10న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఇది జరిగిన సరిగ్గా ఐదు రోజుల తర్వాత (2022 నవంబరు 15న) శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ ఎన్నికల బాండ్లను కొనడం ద్వారా బీజేపీకి రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది.ఈవిషయం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఎన్నికల బాండ్ల లిస్టులో బహిర్గతమైంది. ఈ డబ్బులను బీజేపీ 2022 నవంబరు 21న విత్‌డ్రా చేసుకొని తమ అకౌంట్లోకి వేసుకుంది. కట్ చేస్తే.. 2023 జూన్‌లో ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఆయన అప్రూవర్‌గా మారిన నాలుగు నెలల తర్వాత 2023 నవంబరులో బీజేపీకి అరబిందో ఫార్మా కంపెనీ మరో రూ.25 కోట్ల విరాళాన్ని ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా అందజేసింది.
Also Read :Indias Longest Bridge : పదుల సంఖ్యలో కూలీల మృతి.. కుప్పకూలిన దేశంలోనే పొడవైన వంతెన!
2018 సంవత్సరం నుంచి 2024 ఫిబ్రవరి మధ్యకాలంలో అరబిందో ఫార్మా కంపెనీ ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.52 కోట్లను రాజకీయ పార్టీలకు విరాళంగా అందించింది. దీనిలో అత్యధికంగా రూ.34.5 కోట్లు ఒక్క బీజేపీకే వెళ్లడం గమనార్హం. శరత్ చంద్రా రెడ్డిని ఈడీ అరెస్టు చేయడానికి ముందు అరబిందో ఫార్మా కంపెనీ.. భారత రాష్ట్ర సమితికి రూ.15 కోట్లు, టీడీపీకి రూ.2.50 కోట్లు డొనేట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఏడాది మార్చి 15న అరెస్టయ్యారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం రాత్రే అరెస్టయ్యారు. ఇక ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా గతేడాది ఫిబ్రవరి నుంచి జైలులోనే ఉన్నారు.