Grade Deputy Collectors: 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఆమోదం.. జీవో విడుదల!
33 పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దల కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు. క్యాబినెట్‌లో ఆమోదించడం, ఆ తర్వాత వెంటనే జీవో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
- By Gopichand Published Date - 05:11 PM, Wed - 12 March 25

- 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఆమోదం తెలుపుతూ జీవో విడుదల
- స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను 50కి పెంచుతూ జీవోల విడుదల
- సీఎం, రెవెన్యూ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం
- హర్షం వ్యక్తం చేసిన టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ
Grade Deputy Collectors: రెవెన్యూ చరిత్రలోనే మరో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టునే ఉన్నతంగా ఉండేది. దాని కంటే కూడా అత్యున్నతమైన 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (Grade Deputy Collectors) పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడమే కాకుండా జీవోను కూడా బుధవారం విడుదల చేసింది. జీవో విడుదల పట్ల డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
33 పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దల కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు. క్యాబినెట్‌లో ఆమోదించడం, ఆ తర్వాత వెంటనే జీవో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే కాకుండా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్యను కూడా 50కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జీవోను కూడా విడుదల చేసిందన్నారు.
Also Read: Uber: ఉబర్ రైడ్ ద్వారా రూ. 7500 ఎలా పొందాలో మీకు తెలుసా?
డీసీఏ కృషి ఫలింగానే సాధ్యమైంది: రెవెన్యూ ఉద్యోగ సంఘాలు
ఉమ్మడి రాష్ట్రంలోనూ సాధ్యం కాని 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సాధించిన ఘనత డిప్యూటీ కలెక్టర్ల సంఘానికే దక్కుతుందని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం పేర్కొన్నారు.
33 సెలక్షన్ గ్రేడ్ పోస్టులను సాధించడం, స్పెషల్ గ్రేడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులను 39 నుంచి 50కి పెంచడంలోనూ డిప్యూటీ కలెక్టర్ల సంఘం పాత్ర కీలకంగా ఉందన్నారు. రెవెన్యూ శాఖ బలోపేతానికి కూడా క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు 10,954 పోస్టులు, కొత్త డివిజన్లు, మండలాలలో 361 పోస్టులను సైతం మంజూరు చేయించిన ఘనత దక్కుతుందన్నారు. అన్ని రకాలుగా కృషి చేసిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.