Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?
- Author : Vamsi Chowdary Korata
Date : 18-06-2026 - 11:58 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత పట్టున్న ఖమ్మం జిల్లా రాజకీయ వేదికపై ఇప్పుడు ఒక సరికొత్త ముందస్తు వ్యూహంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని, బంధుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అల్లుడు, ప్రస్తుత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కుమారుడైన అర్జున్ రెడ్డిని వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపేందుకు తెరవెనుక బలమైన పునాది పడుతోందని రాజకీయ వర్గాల్లో వినికిడి. ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధుల్లో అర్జున్ రెడ్డికి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని కల్పించేందుకు, ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా కేడర్‌ను సమన్వయం చేసుకునేలా వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నియోజకవర్గాల పునర్విభజనపై కన్ను.. పాలకుర్తి రేసులో అర్జున్ రెడ్డి!
రాబోయే రోజుల్లో ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) జరిగితే, కొత్తగా ఏర్పడే స్థానాల నుంచి అర్జున్ రెడ్డిని పోటీ చేయించడం చాలా సులభమని పొంగులేటి ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ పునర్విభజన ప్రక్రియ ఆలస్యమైతే.. ప్రత్యామ్నాయంగా వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనను ఎన్నికల బరిలోకి దించేలా ముందస్తు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న ప్రజాదరణ, ఎంపీ రఘురాంరెడ్డికి ఉన్న రాజకీయ అండదండలు తోడైతే యువ నాయకుడిగా అర్జున్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం నల్లేరుపై నడకే అవుతుందని అనుచరవర్గం భావిస్తోంది. ఈ పరిణామాలు గనుక నిజమైతే, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.