Local Body Elections : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నేతల మధ్య రగడ..?
Local Body Elections : బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న పాత కాంగ్రెస్ నేతలతో తలపడుతున్న పరిస్థితి నెలకొంది
- Author : Sudheer
Date : 28-06-2025 - 9:22 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు (Local Body Elections) సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పటికీ, అంతర్గత విభేదాలు పార్టీకి సవాల్‌గా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న పాత కాంగ్రెస్ నేతలతో తలపడుతున్న పరిస్థితి నెలకొంది. తాము ఒరిజినల్ కాంగ్రెస్ నేతలమని వాదించే పాత నేతలు, వలస నేతల వలన తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వర్గ పోరు బహిరంగంగా వెలుగులోకి వస్తోంది.
ఒరిజినల్ వర్సెస్ వలస నేతల పోరు – జిల్లాల వారీగా ఉద్రిక్తతలు
జగిత్యాలలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్‌లో కడియం వర్సెస్ కొండా, గద్వాలలో బండ్ల వర్సెస్ జెడ్పీ ఛైర్మన్ సరిత, పఠాన్ చెరులో గూడెం వర్సెస్ నీలం & కఠారి, భద్రాచలంలో తెల్లం వర్సెస్ పొదెం, బాన్సువాడలో పోచారం వర్సెస్ ఎనుగు రవీందర్ రెడ్డి, చేవెళ్లలో కాలే వర్సెస్ భీం భరత్ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వలస నేతల ప్రాధాన్యత పెరగడాన్ని పాత నేతలు వ్యతిరేకిస్తున్నారు. తామే కాంగ్రెస్‌కు నమ్మకంగా పనిచేసినవారమని, ఇప్పుడు అవకాశాలు వారి వర్గీయులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక్కడు వారి వర్గం బలాన్ని చూపించేందుకు పంచాయతీ ఎన్నికలను టెస్ట్‌గా భావిస్తున్నారు.
స్థానిక ఎన్నికల ముందస్తు సమస్యలు – కాంగ్రెస్‌కు సవాల్
ఈ వర్గ పోరులతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఒక్క వర్గానికి టికెట్లు ఇవ్వడమో, ఇంకొక వర్గాన్ని పక్కన పెట్టడమో వల్ల అసంతృప్తి, తిరుగుబాటు తప్పదు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా నియంత్రించకపోతే, ఇది ప్రత్యర్థి పార్టీలకు లాభంగా మారే ప్రమాదం ఉంది. ఈ అంతర్గత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు పెద్ద పరీక్షగా మారింది. ఎన్నికల నాటికి ఈ వర్గ పోరును సమసిపెట్టకపోతే, ఇది కాంగ్రెస్ పార్టీని అనుకోని దారిలోకి తీసుకెళ్లే అవకాశముంది.