CM KCR: అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయమైనది!
ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో
- By Balu J Updated On - 08:10 AM, Tue - 6 December 22

ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం పరిఢవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ అని సీఎం కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. తాను అనుభవించిన సామాజిక వివక్షను సవాల్ గా తీసుకుని విజయం సాధించి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి దిక్సూచిగా నిలిచి, ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయమైనదని సీఎం అన్నారు.
జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్, భారతదేశ అస్తిత్వపు ప్రతీకగా సీఎం పేర్కొన్నారు. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించాలనే అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం సకల జనుల సాధికారత దిశగా కృషి చేస్తున్నదన్నారు. తర తరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతికి కనీ వినీ ఎరుగని రీతిలో అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకానికి ప్రేరణ, స్ఫూర్తి అంబేద్కర్ మహాశయుడేనని సీఎం అన్నారు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన అంబేద్కర్ మూర్తిమత్వాన్ని విశ్వానికి చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సీఎం అన్నారు. తెలంగాణ కొత్త సచివాలయానికి “డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం” అని పేరు పెట్టుకున్నామన్నారు. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టిస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత, బహుజన, పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి మనమిచ్చే అసలైన నివాళి. అదే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని సీఎం అన్నారు.

Related News

Sarpanch Attempt Suicide: నాడు రాజు.. నేడు బిచ్చగాడు.. అప్పులతో ‘సర్పంచ్’ ఆత్మహత్యాయత్నం
బంగారు తెలంగాణలో సర్పంచులు కాస్తా బిచ్చగాళ్లుగా మారుతున్నారు.