New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు.. సీఎం రేవంత్ పచ్చజెండా
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- By Pasha Published Date - 07:47 AM, Tue - 19 December 23

New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈవిషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
గత బీఆర్ఎస్ సర్కారు దాదాపు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులను(New Ration Cards) జారీ చేయలేదు. ఉన్న కార్డుల్లో కొత్తగా పేర్ల నమోదుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. రేషన్ కార్డులు లేక చాలామంది ఆరోగ్యశ్రీ లాంటి సేవలను అందుకోలేకపోయారు. ఈనేపథ్యంలో ఈసారి కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యచికిత్సల పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయకపోవడంతో పిల్లల పేర్లను చేర్చుకునేందుకు అవకాశం లేక వేలాది కుటుంబాలు ఉచిత బియ్యానికి దూరమయ్యారు. ఒక్కో జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో జిల్లాలో రేషన్ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం 60 వేల నుంచి 90 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.