Balkampet Yellamma : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు
మొదటి రోజు ‘పెళ్లికూతురు ఎదుర్కొళ్ల’, రెండో రోజు ‘అమ్మవారి కల్యాణం’, మూడో రోజు ‘రథోత్సవం’ నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం సందర్బంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్ పరిధిలోని ముఖ్య మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- By Latha Suma Published Date - 12:29 PM, Tue - 1 July 25

Balkampet Yellamma : హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరిగిన వార్షిక కల్యాణ మహోత్సవం ఈసారి మరింత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం నిర్వహించే ఈ కల్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా వేడుకల శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సంప్రదాయ మేళతాళాలతో, మంగళవాయిద్యాలతో దేవాలయం ప్రత్యక్ష దైవస్వరూపంగా మారింది. అమ్మవారి కల్యాణం కోసం రంగురంగుల ఫ్లెక్సీలు, లైటింగ్‌లతో ఆలయ పరిసరాలు మెరిసిపోయాయి. ఉదయం 5 గంటల నుంచే అమ్మవారి దర్శనాన్ని భక్తులకు ప్రారంభించారు. దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. వీఐపీ సందర్శకుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటయ్యాయి.
Read Also: INS Tamal : భారతీయ నేవీలోకి కొత్త యుద్ధ నౌక..నేడు జలప్రవేశం
ప్రభుత్వ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వ మరియు ఆలయ అధికారులు కలిసి వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొదటి రోజు ‘పెళ్లికూతురు ఎదుర్కొళ్ల’, రెండో రోజు ‘అమ్మవారి కల్యాణం’, మూడో రోజు ‘రథోత్సవం’ నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం సందర్బంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్ పరిధిలోని ముఖ్య మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని ప్రధాన రోడ్లు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అమ్మవారి దర్శనానికి హాజరయ్యారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం తల్లి కల్యాణానికి హాజరవుతున్నాను. ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేసింది. గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరుగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖలతో సమన్వయం చేసి వేడుకలు విజయవంతంగా జరగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అని చెప్పారు. జీహెచ్ఎంసీ, పోలీస్, మెడికల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనిచేశారు. భక్తుల కోసం ప్రథమ చికిత్స కేంద్రాలు, తాగునీటి ఏర్పాటు, తాత్కాలిక శౌచాలయాలు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఈ అద్భుతమైన ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఐదుగంటల పాటు క్యూ లో నిలబడి అమ్మవారి దర్శనం పొందారు. అఖండ నామస్మరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఉత్సవానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.