Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు
- Author : Vamsi Chowdary Korata
Date : 04-07-2026 - 10:49 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తు కార్యాచరణను ప్రజలతో పంచుకున్నారు.
రెండు దశాబ్దాల క్రితం మిడ్జిల్స్‌లో ‘రేవంత్ రెడ్డి’గా మొదలైన తన ప్రస్థానం, నేడు ప్రజల ఆదరాభిమానాలతో ‘రేవంతన్న’గా వారి గుండెల్లో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అభివర్ణించారు. ఈ 20 ఏళ్ల కాలంలో ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం తాను చేసిన ప్రతి పోరాటంలో అండగా నిలిచిన ఆత్మీయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ‘తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడి’గా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అన్నింటికీ మించి ‘రేవంతన్న’గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.