Tim Cook: ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పదవి వీడే అవకాశం.. తదుపరి CEOగా జాన్ టెర్నస్?
యాపిల్ సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్‌ను పరిచయం చేసింది. అందులో ఐఫోన్ ఎయిర్‌ను (iPhone Air) టెర్నసే స్వయంగా ప్రవేశపెట్టారు.
- By Gopichand Published Date - 09:59 AM, Tue - 7 October 25

Tim Cook: యాపిల్ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) త్వరలో తన పదవిని వీడవచ్చు. వచ్చే నెలలో 65 ఏళ్లు పూర్తి చేసుకోనున్న కుక్, 2011 నుండి యాపిల్ సంస్థ పగ్గాలను నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా కుక్ పదవి నుంచి వైదొలగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన తరువాత ఎవరు? అనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
యాపిల్‌ను కవర్ చేసే జర్నలిస్ట్ మార్క్ గుర్మాన్ (Mark Gurman) కథనం ప్రకారం.. జాన్ టెర్నస్ (John Ternus) కంపెనీ తదుపరి సీఈఓ కావచ్చు. ప్రస్తుతం ఆయన కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గత 24 సంవత్సరాలుగా యాపిల్‌తో కలిసి పనిచేస్తున్నారు.
Also Read: Baahubali 3 : ‘బాహుబలి-3’పై ఆ ప్రచారం అవాస్తవం- నిర్మాత
పలు కీలక నిర్ణయాల్లో టెర్నస్ భాగస్వామ్యం
టెర్నస్ కంపెనీకి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన వయస్సు కూడా ఆయనకు అనుకూలంగా ఉంది. అంతా సవ్యంగా జరిగితే 50 ఏళ్ల టెర్నస్ రాబోయే పదేళ్ల వరకు కంపెనీకి నాయకత్వం వహించగలరు. యాదృచ్ఛికంగా కుక్ యాపిల్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయస్సు కూడా 50 ఏళ్లే. గుర్మాన్ అభిప్రాయం ప్రకారం.. యాపిల్‌లోని మిగిలిన సీనియర్ అధికారులు వయస్సులో చాలా చిన్నవారు లేదా కొందరి వయస్సు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉంది. అందువల్ల టెర్నస్ వారసుల రేసులో ముందంజలో ఉన్నారు.
ఐఫోన్ ఎయిర్‌ను పరిచయం చేసింది టెర్నసే
యాపిల్ సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్‌ను పరిచయం చేసింది. అందులో ఐఫోన్ ఎయిర్‌ను (iPhone Air) టెర్నసే స్వయంగా ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఐఫోన్ 17 సిరీస్ లాంచింగ్ సమయంలో ఆయన లండన్‌లోని రీజెంట్ స్ట్రీట్ స్టోర్‌లో కూడా ఉండి, ఐఫోన్ కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్‌లను కలిశారు. కంపెనీలో ఆయనకు మంచి పేరు ఉంది. టిమ్ కుక్‌కు కూడా ఆయనపై పూర్తి నమ్మకం ఉంది. అయితే కుక్ ఇప్పటివరకు అధికారికంగా పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించలేదు. కానీ త్వరలో ఆయన ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.