JIO 5G: ఏపీలో ఆ 9 పట్టణాలలో జియో 5జీ సేవలు.. అవేవంటే?
ప్రముఖ టెలికాం సంస్థ రియల్ మీ జియో ఇప్పటికే దేశవ్యాప్తంగా 5జీ సేవలను ఎన్నో నగరాలలోకి అందుబాటులోకి
- Author : Anshu
Date : 21-03-2023 - 5:50 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ టెలికాం సంస్థ రియల్ మీ జియో ఇప్పటికే దేశవ్యాప్తంగా 5జీ సేవలను ఎన్నో నగరాలలోకి అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నగరాలతో పాటు మరిన్ని నగరాలకు 5జి సేవలను విస్తరించే ప్రయత్నం చేస్తోంది జియో సంస్థ. ఈ క్రమంలోనే నేటి నుంచి అనగా మార్చి 21 నుంచి మరో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 41 నగరాలు పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జియో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో మొత్తం దేశవ్యాప్తంగా 406 నగరాలు అలాగే పట్టణాలలో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్టే అని తెలిపింది జియో సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా అందుబాటులోకి వచ్చిన 5జీ పట్టణాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 9 పట్టణాలు ఉన్నాయి. మరి ఆ తొమ్మిది పట్టణాలు ఏవి అన్న విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నరసాపురం, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లి గూడెం లాంటి 9 పట్టణాల్లో జియో 5జీ సేవలు ప్రారంభించినట్లు జియో సంస్థ తెలిపింది.
ఇప్పటికే గతంలో విజయవాడ, విశాఖ, తిరుమల, తిరుపతి, రాజమహేంద్రవరం, చిత్తూరు, కడప, నరసారావుపేట, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కాకినాడ, కర్నూలు, గుంటూరు తదితర నగరాలలో,పట్టణాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జియో 5జీ వినియోగదారులు ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను ఉపయోగించవచ్చని జియో సంస్థ పేర్కొంది. 5జీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండడంతో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు కూడా అందుకు అనుగుణంగా 5జి మొబైల్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.