Unmanned Combat Aircraft: తొలి స్వదేశీ మానవరహిత యుద్ధ విమానం.. పరీక్ష సక్సెస్
తొలిసారిగా మానవ రహిత యుద్ధ విమానాన్ని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( డీఆర్డీవో) పరీక్షించింది.
- Author : Hashtag U
Date : 01-07-2022 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
తొలిసారిగా మానవ రహిత యుద్ధ విమానాన్ని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( డీఆర్డీవో) పరీక్షించింది.మొట్ట మొదటిసారిగా ఇవాళ నిర్వహించిన పరీక్షలో ఇది సాఫీగా టేకాఫ్ తీసుకొని గగనవిహారం చేయడమే కాకుండా, ఎలాంటి లోపాలు లేకుండా తిరిగి ల్యాండైంది. దీనికి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ గా నామకరణం చేశారు. ఈ ప్రయోగ పరీక్షతో భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అద్భుత అస్త్రం భారత సేన అమ్ములపొదిలో చేరేందుకు మార్గం సుగమం అయింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో మానవ రహిత యుద్ధ విమానాన్ని పరీక్షించారు. ఇది ఘనవిజయం అని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. టేకాఫ్, వే పాయింట్ నావిగేషన్, స్మూత్ టచ్‌డౌన్‌తో సహా కచ్చితమైన ప్రమాణాలను ఈ విమానం చేరుకున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా స్పందించారు. అపూర్వ ఘనత సాధించారంటూ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. క్లిష్టమైన సైనిక వ్యవస్థల రూపకల్పన దిశగా ‘ఆత్మనిర్భర్ భారత్’ కు మార్గదర్శనం చేశారని కొనియాడారు.
ఎక్కడ.. ఎలా ?
* మానవ రహిత యుద్ధ విమానం డీఆర్డీవో ప్రధాన పరిశోధనా ప్రయోగశాల అయిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆధ్వర్యంలో తయారు చేశారు.
* ఇది ఒక చిన్న టర్బోఫ్యాన్ ఇంజన్‌తో రన్ అవుతుంది.
* మానవరహిత విమానాన్ని పరీక్షించేందుకు ఉపయోగించిన ఎయిర్‌ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లైట్ కంట్రోల్, ఏవియానిక్స్ వ్యవస్థలను ఇండియాలోనే అభివృద్ధి చేశారు.
#DRDOUpdates | Successful Maiden Flight of Autonomous Flying Wing Technology Demonstrator@PMOIndia https://t.co/K2bsCRXaYp https://t.co/brHxaH7wbF pic.twitter.com/SbMnI5tgUM
— DRDO (@DRDO_India) July 1, 2022