Smartphones: పాత స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
తాజా యాప్స్, కొత్త ఫీచర్లు పాత ఫోన్‌లో సరిగ్గా పని చేయవు. ఫలితంగా ఫోన్ నెమ్మదిగా పని చేస్తుంది.
- By Dinesh Akula Published Date - 04:37 PM, Wed - 24 September 25

Smartphones: చాలామంది తమ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎంత పాతదైనా కొనసాగిస్తూ వాడుతుంటారు. ఇది కొన్ని సందర్భాల్లో ఖర్చు తగ్గించడంలో ఉపయోగపడినా, భద్రతాపరంగా చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాత ఫోన్‌లకు మాన్యుఫ్యాక్చరర్లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు ఇవ్వడం నిలిపేస్తారు. దీని వల్ల ఆ ఫోన్ హ్యాకింగ్‌కు దారితీసే బలహీనతలతో ఉండే అవకాశముంది. హ్యాకర్లు ఈ లోపాలను వాడుకుని యూజర్ల ఫోన్‌కి ప్రవేశించి, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, పాస్‌వర్డ్‌లు, ఫోటోలు లాంటి గోప్య సమాచారం దొంగిలించవచ్చు.
ఇది తక్కువ ప్రమాదమేమీ కాదు. అంతేకాకుండా పాత ఫోన్ల బ్యాటరీలు కాలక్రమంలో దెబ్బతిని వేడెక్కడం, ఉబ్బిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి పేలే ప్రమాదం కూడా ఉంది. ఫోన్ వాడే వ్యక్తి భౌతికంగా గాయపడే అవకాశాలు ఉన్నాయని పలు కేసులు ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.
తాజా యాప్స్, కొత్త ఫీచర్లు పాత ఫోన్‌లో సరిగ్గా పని చేయవు. ఫలితంగా ఫోన్ నెమ్మదిగా పని చేస్తుంది. ఇది యూజర్ల పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి.
ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకుని పాత ఫోన్‌ను భద్రతా పరంగా జాగ్రత్తగా వాడాలి. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలకు పాత ఫోన్ ఉపయోగించడం మంచిది కాదు. అనధికార యాప్ స్టోర్‌ల నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేయరాదు. గుర్తింపు ఉన్న యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కొంత భద్రత కల్పించుకోవచ్చు.
కాబట్టి, డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో పాత ఫోన్ వాడుతున్నా, మీ వ్యక్తిగత భద్రత, డేటా రక్షణకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అంతేకాదు, ఏ ఫోన్ అయినా మూడు నుంచి నాలుగు సంవత్సరాలకే భద్రతాపరంగా తగ్గుదల చూపడం సహజం. అందుకే తగిన జాగ్రత్తలతో పాటు అవసరమైతే ఫోన్ అప్గ్రేడ్ చేయడం ఉత్తమం.