Paytm: ఎయిర్‌టెల్ & పేటీఎం పేమెంట్ బ్యాంక్ కలిసి ఒకే బ్యాంక్ గా పనిచేయనున్నాయి
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ - ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్ కలిసి ఒకే సంస్థగా పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి,
- Author : Maheswara Rao Nadella
Date : 25-02-2023 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ – ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్ కలిసి ఒకే సంస్థగా పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి, విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. భారతదేశ టెలికాం రంగ దిగ్గజం సునీల్ మిత్తల్ (Sunil Mittal), పేటీఎంలో (Paytm) వాటా కొనాలని చూస్తున్నారు. ఈ డీల్ ప్రకారం, తన ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్‌ను ఫిన్‌టెక్ దిగ్గజానికి చెందిన పేమెంట్స్ బ్యాంక్‌తో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
స్టాక్స్ డీల్ ద్వారా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను (Airtel Payments Bank) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో (Paytm Payments Bank) కలిపేయాలని మిత్తల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పేటీఎం వాటాదార్ల నుంచి కూడా Paytm షేర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కాబ్టటి, రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదురుతుందా, లేదా అన్న అంశంపై ప్రస్తుతం స్పష్టత లేదు.
క్రమంగా పుంజుకుంటున్న పేటీఎం(Paytm):
పేటీఎం బ్రాండ్‌ను నడిపిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (One 97 Communications Ltd), లాభదాయకత సంకేతాలు ఇచ్చింది. 2022 నవంబర్‌లోని, దాని రికార్డు కనిష్ట స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు 40 శాతం పుంజుకుంది. కస్టమర్లను భారీగా చేర్చుకోవడంపై దృష్టి సారించిన తర్వాత ఈ కంపెనీ, తన Q3 (డిసెంబర్ త్రైమాసికం) నష్టాన్ని కూడా తగ్గించుకుంది. కస్టమర్ల సముపార్జన వల్ల ఆదాయం పెరిగిందని ఈ నెల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం తెలిపింది.
నవంబర్ 2021లోని లిస్ట్ అయిన Paytm షేర్లు, దాని IPO ధర రూ. 2,150 ని ఏ నాడూ దాడి పైకి వెళ్లలేదు. గత దశాబ్ద కాలంలో వచ్చిన పెద్ద IPOల్లో, మొదటి సంవత్సరం ఇంత భారీగా షేర్ పతనాన్ని చూసిన కంపెనీ మరొకటి లేదు. దీని పెట్టుబడిదారు కంపెనీల్లో… చైనాకు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్, యాంట్ గ్రూప్ కో ఉన్నాయి.
పేటీఎం షేర్ ధర, శుక్రవారం (25 ఫిబ్రవరి 2023) ట్రేడ్‌లో 2.55% లాభంతో రూ. 622 వద్ద ముగిసింది. ఈ స్టాక్ గత 6 నెలల కాలంలో 19% క్షీణించింది, గత ఏడాది కాలంలో 21% పైగా పతనమైంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను మిత్తల్ ప్రారంభించి ఆరు సంవత్సరాలు అయింది. ఈ బ్యాంక్‌కు 129 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం… మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ లాభాల్లోకి టర్న్ అయింది.
Also Read: Supermarket in Britain: బ్రిటన్‌లో కూరగాయలు, పండ్లకు కటకట