Siraj On Kohli : కోహ్లీపై సిరాజ్ ఎమోషనల్ పోస్ట్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఆటగాళ్ళలో కొందరు కోహ్లీ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని కితాబిస్తే... మరికొందరు బీసీసీఐ వైఖరిపై మండిపడుతున్నారు.
- By Hashtag U Published Date - 01:12 PM, Tue - 18 January 22

టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఆటగాళ్ళలో కొందరు కోహ్లీ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని కితాబిస్తే… మరికొందరు బీసీసీఐ వైఖరిపై మండిపడుతున్నారు. అటు జట్టులో ఉన్న సహచర ఆటగాళ్ళు కెప్టెన్ గా కోహ్లీతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కోహ్లీపై భావోద్వేగపు ట్వీట్ చేశాడు. కోహ్లీ సారథ్యంలోనే అద్భుతమైన బౌలర్ గా ఎదిగిన సిరాజ్ మాజీ కెప్టెన్ తో తన బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్ ను గాడిలో పెట్టిన అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసించాడు. అతను తన సూపర్ హీరో అంటూ ట్వీట్ చేశాడు. ఎప్పటికీ నా కెప్టెన్ నువ్వేనంటూ ఈ హైదరాబాదీ బౌలర్ భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్ ప్రారంభంలో తనను ఎంతగానో ప్రోత్సహించిన కోహ్లీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు. కోహ్లీ ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ కు కేవలం కృతజ్ఞలు కూడా సరిపోవన్నాడు.
కోహ్లీ కెప్టెన్సీలోనే సిరాజ్ వన్డే, టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆడుతున్నప్పుడూ సిరాజ్ కు కోహ్లీతో ప్రత్యేక బంధం ఏర్పడింది. ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ లో సిరాజ్ కు మంచి ప్రాధాన్యత ఇస్తూ బాగా ప్రోత్సహించాడు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సిరాజ్ ఇంట్లో భోజనం చేయకుండా కోహ్లీ వెళ్ళడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీతో తన బంధంపై ఎమోషనల్ ట్వీట్ చేశాడు సిరాజ్. చాలా సందర్భంగా సిరాజ్ స్వింగ్ బౌలింగ్ ను కోహ్లీ ప్రశంసించాడు. అతను వైఫల్యాల బాటలో ఉన్నప్పుడు అండగా నిలిచిన విరాట్ సిరాజ్ ను మంచి బౌలర్ గా రూపాంతరం చెందడంలో కీలక పాత్ర పోషించాడని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా చాలా సందర్భాల్లో వెల్లడించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలోనే ఉన్న సిరాజ్ గాయంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుండి కోలుకున్న సిరాజ్ తొలి వన్డేలో ఆడే అవకాశముంది. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ బుధవారం నుండి మొదలుకానుంది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో దూరమైన నేపథ్యంలో కెఎల్ రాహుల్ టీమిండియాను లీడ్ చేయనున్నాడు. స్టార్ పేసర్ బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.