Vaibhav Suryavanshi: వైభవ్ డ్రెస్సింగ్ రూంలో ఏడుస్తుంటే వీవీఎస్ లక్ష్మణ్ అతని వద్దకు వెళ్లాడు..! ఆ తరువాత దశ మారిపోయింది..
వైభవ్ సూర్యవంశీ ఈ స్థాయికి రావడానికి భారత లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్ పాత్ర ఎంతో కీలకం
- By News Desk Published Date - 01:23 PM, Tue - 29 April 25

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 వేలంలో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కోటి రూపాయలకు పైగా రేటు పలకడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ ప్లేయర్‌ను కొనుగోలు చేసింది. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదిన వైభవ్.. క్రీజులో ఉన్నంతసేపు సూపర్ షాట్లతో అందరిని ఆశ్చర్యపర్చాడు. ప్రస్తుతం ఆ కుర్రాడు ఏకం సెంచరీ చేశాడు. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఫలితంగా ఐపీఎల్‌లోనే కాక మొత్తంగా టీ20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.
వైభవ్ సూర్యవంశీ ఈ స్థాయికి రావడానికి భారత లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్ పాత్ర ఎంతో కీలకం. బీసీసీఐ నిర్వహించిన అండర్-19 వన్డే ఛాలెంజర్ టోర్నమెంట్ సందర్భంగా వైభవ్ తొలిసారి లక్ష్మణ్‌ను కలిశాడు. బీహార్‌లో జరిగిన అంతర్ జిల్లా సీనియర్ టోర్నమెంట్‌లో అతని ప్రదర్శన ఆధారంగా అండర్-19కి ఎంపిక చేశారు. అతని ప్రతిభకు ముగ్ధుడైన వీవీఎస్ లక్ష్మణ్ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగే అండర్-19 సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇండియా-బి జట్టు తరపున ఆడిన ఒక మ్యాచ్‌లో వైభవ్ 36 పరుగులకు రనౌట్ అయ్యాడు. దీంతో అతను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఏడవడం మొదలుపెట్టాడు. లక్ష్మణ్ గమనించి అతని వద్దకు వెళ్లాడు.. మేము ఇక్కడ పరుగులు మాత్రమే చూడము. దీర్ఘకాలం పాటు ఆడగల నైపుణ్యం ఉన్న వ్యక్తులను మాత్రమే చూస్తుమని చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభను లక్ష్మణ్ చాలా త్వరగా గుర్తించాడు. దీనికితోడు బీసీసీ కూడా అతనికి మద్దతు ఇచ్చిందని వైభవ్ కోచ్ మనోజ్ ఓజా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లక్ష్మణ్ సిఫార్సు చేశాడు. దీంతో రాహుల్ ద్రవిడ్ అతన్ని తన జట్టులోకి తీసుకున్నాడు. వాస్తవానికి, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) అధిపతిగా పనిచేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీని ద్రవిడ్‌కు సిఫార్సు చేయడం కంటే ముందు రెండు సంవత్సరాలుగా అతని ఆటతీరును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూవచ్చాడు. ఏప్రిల్ 19న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో మొదటి బంతికే శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని సిక్స్‌గా మలిచాడు. ఆ సమయంలో తాను బిగ్ హిట్టర్‌నని తెలియజేశాడు. ఆ మ్యాచ్ లో వైభవ్ 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఏడ్చుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లడం కనిపించింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపర్చాడు.