IND VS PAK: షేక్‌హ్యాండ్ ఇస్తారని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం: సల్మాన్ ఆఘా
- Author : Vamsi Chowdary Korata
Date : 02-05-2026 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
గతేడాది ఆసియా కప్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య చోటుచేసుకున్న ‘హ్యాండ్‌షేక్ వివాదం’ క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పహల్గామ్ దాడుల నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు జాతీయ భావనకు అనుగుణంగా వ్యవహరించింది. అయితే, ఈ వివాదంపై పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ అలీ ఆఘా తాజాగా స్పందిస్తూ, అప్పుడు తెర వెనుక ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించాడు. అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Salman Ali Agha relieved about India vs Pakistan handshake controversy:
Before the match, there was a press conference and a trophy shoot, and there was a handshake there too. So when I was going for the toss, I was pretty normal. I said, “Obviously, I had an idea that things… pic.twitter.com/zImpcx7pG1
— TEJASH (@Tejashyyyyy) May 2, 2026
ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉందని ఆఘా గుర్తుచేశాడు. “టాస్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్, ట్రోఫీ షూట్ సమయంలో మేం షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నాం. టాస్ వేయడానికి వెళుతున్నప్పుడు నేను మామూలుగానే ఉన్నాను. అయితే, వాతావరణం సాధారణంగా ఉండదని నాకు తెలుసు. కానీ, ఏకంగా షేక్‌హ్యాండ్ కూడా ఉండదని నేను ఊహించలేదు” అని ఆఘా తెలిపాడు.
“మా మీడియా మేనేజర్‌తో కలిసి టాస్ కోసం వెళుతున్నప్పుడు, మ్యాచ్ రిఫరీ నన్ను పక్కకు పిలిచి ‘ఈసారి షేక్‌హ్యాండ్ ఉండదు, దయచేసి గమనించండి’ అని చెప్పారు. దానికి నేను ‘సరే, షేక్‌హ్యాండ్ లేకపోతే నాకేం ఫర్వాలేదు. నాకేమీ పెద్ద ఆసక్తి లేదు’ అని బదులిచ్చాను. ఈ విధంగా నాకు ముందే సమాచారం అందింది” అని ఆఘా వివరించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. మ్యాచ్‌కు ముందు షేక్‌హ్యాండ్ ఉండదని తెలిసినప్పటికీ, మ్యాచ్ తర్వాత అయినా కరచాలనం ఉంటుందని ఆఘా భావించాడు. “మ్యాచ్ ముగిశాక, మేం ఓడిపోయాం. షేక్‌హ్యాండ్ ఇవ్వడం కోసం మా జట్టు మొత్తం భారత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాం. కానీ అప్పటికీ వారు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మేము వెళ్లేసరికి వారి డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసి ఉన్నాయి” అని ఆఘా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలాంటి ఘటనలు క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని, కింది స్థాయి క్రీడపై చెడు ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. “మనం ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు మనల్ని గమనిస్తుంటారు. వాళ్లు మన నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి. రేపు ఏదైనా క్లబ్ గేమ్‌లో ఇలాంటిదే జరిగితే, దానికి పరోక్షంగా నేను కూడా కారణమవుతాను. రోల్ మోడల్స్‌గా ఉన్నప్పుడు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆఘా వ్యాఖ్యానించాడు.