Virat Kohli : కోహ్లీ…అంతా ఓకేనా ?
భారత క్రికెట్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు సగటు అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై బహిరంగ విమర్శలు గుప్పించాడో ఆ తర్వాత నుండీ విరాట్ వర్సెస్ బీసీీసీఐ ఎపిసోడ్ మరింత హీటెక్కింది
- By Hashtag U Published Date - 04:42 PM, Mon - 3 January 22

భారత క్రికెట్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు సగటు అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై బహిరంగ విమర్శలు గుప్పించాడో ఆ తర్వాత నుండీ విరాట్ వర్సెస్ బీసీీసీఐ ఎపిసోడ్ మరింత హీటెక్కింది.టీ ట్వంటీ ఫార్మేట్ సారథ్య బాధ్యతల నుండి తప్పుకునే విషయంలో మరోసారి ఆలోచించాలంటూ తాము చెప్పినట్టు గంగూలీ వ్యాఖ్యానించగా.. కెప్టెన్సీ నుండి తప్పుకోవద్దంటూ తనకు ఎవరూ చెప్పలేదని కోహ్లీ వివరణ ఇవ్వడం ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై బీసీసీఐ చూసుకుంటుందంటూ గంగూలీ సమాధానం దాటవేయగా… కోహ్లీ సౌతాఫ్రికా టూర్ లో మీడియా సమావేశాలకు కూడా హాజరుకాకపోవడంతో ఏదో జరుగుతుందన్న వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఇప్పుడు సఫారీ జట్టుతో రెండో టెస్టుకు చివరి నిమిషంలో కోహ్లీ తప్పుకోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
కేవలం టెస్ట్ ఫార్మేట్ లో మాత్రమే సారథిగా ఉన్న కోహ్లీ ఈ మ్యాచ్ లో జట్టును గెలిపిస్తే సఫారీ గడ్డపై సిరీస్ విజయాన్ని అందించిన ఏకైక భారత కెప్టెన్ గా రికార్డులకెక్కుతాడు. ఇలాంటి అరుదైన అవకాశం ముంగిట కోహ్లీ తుది జట్టు నుండి తప్పుకోవడం అందరికీ షాకిచ్చింది. వెన్నునొప్పి కారణంగానే కోహ్లీ తప్పుకున్నాడని మేనేజ్ మెంట్ చెబుతున్నా అసలు సంగతి మాత్రం ఏదో ఉందన్న వాదన వినిపిస్తోంది. కొత్త కోచ్ ద్రావిడ్ తో విరాట్ కు ఎటువంటి ఇబ్బందులూ లేకున్నా… బీసీసీఐపై విమర్శలు చేసిన తర్వాత కోహ్లీ మీడియాకు, ఫోటోలకు కూడా దూరంగా ఉండడం అనుమానాలను పెంచుతోంది. మ్యాచ్ కు ముందు రోజు జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ గాయం గురించి ద్రావిడ్ కూడా ఏం చెప్పలేదు. విరాట్ ఫామ్ లోకి వస్తాడని, ఎవరూ అతని సత్తా గురించి ప్రశ్నించనవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. తాను వందో టెస్ట్ ఆడే రోజున మీడియా ముందుకు కోహ్లీ వస్తాడని కూడా స్పష్టం చేశాడు.
దీనికి తోడు ప్రాక్టీస్ సెషన్స్ లో చెమటోడ్చుతూ కనిపించిన కోహ్లీ మ్యాచ్ కు కొన్ని నిమిషాల ముందు తప్పుకోవడం వెనుక కారణమేంటనేది అంతుబట్టడం లేదు. బీసీసీఐతో ప్రస్తుతం కోహ్లీ సంబంధాలు సరిగా లేకపోవడమే కారణమా… లేక బోర్డు వైఖరిపై మనస్థాపంతోనే కోహ్లీ తప్పుకున్నాడా…వంటి పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అతని అభిమానులు మాత్రం బీసీసీఐ వైఖరి నచ్చకే తప్పుకున్నాడంటూ మండిపడుతున్నారు. మరి మూడో టెస్టుకైనా కోహ్లీ వస్తాడా లేక ఇలాగే చివరి నిమిషంలో షాకిస్తాడా అనేది వేచి చూడాలి.